ఇస్లాం
వెనక్కి

79. అన్-నాజియాత్

1(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా

2(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా

3(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా

4మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా

5మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా

6ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది

7దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు)

8ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి

9వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి

10వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా

11మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా

12వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే

13కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని

14అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు

15ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా

16అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు

17(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు

18ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా

19మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా

20తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు

21కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు

22ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు

23పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ

24ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును

25కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు

26నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది

27ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది

28ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు

29మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు

30మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు

31దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు

32మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు

33మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా

34ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు

35ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు

36మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది

37ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి

38మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి

39నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది

40మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి

41నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది

42(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు

43దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం

44దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది

45(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే

46వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath