70. అల్-మఆరిజ్
1ప్రశ్నించేవాడు, ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు
2సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు
3అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది
4యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్) ఆయన వద్దకు అధిరోహిస్తారు
5కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో
6వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు
7కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది
8ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది
9మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి
10మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు
11వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు
12మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి
13మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను
14మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు
15కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)
16అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది
17అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది
18మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని
19నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు
20తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు
21మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు
22నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప
23ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో
24మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో
25యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి
26మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో
27మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో
28నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు
29మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో
30తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు
31కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు
32మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో
33మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో
34మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో
35ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు
36ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు
37కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా
38ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా
39అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు
40కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము
41వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు
42కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు
43ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు
44వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath