ఇస్లాం
వెనక్కి

69. అల్-హక్కా

1ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)

2ఏమిటా అనివార్య సంఘటన

3మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు

4సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు

5కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు

6మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు

7ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు

8అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా

9ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ, అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే

10మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు

11నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము

12దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము

13ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో

14మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో

15అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది

16మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది

17మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు

18ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు

19ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి

20నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని

21కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు

22అత్యున్నతమైన స్వర్గవనంలో

23దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి

24(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి

25ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది

26మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది

27అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది

28నా సంపద నాకేమీ పనికి రాలేదు

29నా అధికారమంతా అంతమై పోయింది

30(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి

31తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి

32ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి

33వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు

34మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు

35కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు

36మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు

37దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు

38కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను

39మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా

40నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు

41మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ

42మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ

43ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది

44ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే

45మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం

46తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం

47అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు

48మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం

49మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు

50మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది

51మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం

52కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath