ఇస్లాం
వెనక్కి

56. అల్-వాకియా

1ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు

2అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు

3అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది

4భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు

5మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు

6అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు

7మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు

8ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)

9మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)

10మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు

11అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు

12వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు

13మొదటి తరాల వారిలో నుండి చాలా మంది

14మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది

15(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద

16ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు

17వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు

18(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో

19దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు

20మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి

21మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం

22మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్)

23దాచబడిన ముత్యాల వలే

24ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా

25అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు

26శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప

27మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)

28వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య

29మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు

30మరియు వ్యాపించి ఉన్న నీడలు

31మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు

32మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు

33ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో)

34మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు

35నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము

36మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము

37వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు)

38కుడిపక్షం వారి కొరకు

39అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు

40మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు

41ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)

42వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో

43మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు)

44అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు

45నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి

46మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి

47మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా

48మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా

49వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ

50వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు

51ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా

52మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు

53దానితో కడుపులు నింపుకుంటారు

54తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు

55వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు

56తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే

57మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు

58ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా

59ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము

60మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు

61మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి

62మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు

63మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా

64మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము

65మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు

66(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము

67కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని

68ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా

69మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము

70మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు

71మీరు రాజేసే అగ్నిని గమనించారా

72దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా

73మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము

74కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు

75ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను

76మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది

77నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది

78సురక్షితమైన గ్రంథంలో ఉన్నది

79దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు

80ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది

81ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా

82మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా

83అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)

84మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు

85మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు

86ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే

87మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు

88కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే

89అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి

90మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో

91అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది)

92మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో

93అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది

94మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది

95నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం

96కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath