ఇస్లాం
వెనక్కి

52. అట్-తుర్

1తూర్ పర్వతం సాక్షిగా

2వ్రాయబడిన గ్రంథం సాక్షిగా

3విప్పబడిన చర్మపత్రం మీద

4చిరకాల సందర్శనాలయం సాక్షిగా

5పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా

6ఉప్పొంగే సముద్రం సాక్షిగా

7నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది

8దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు

9ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు

10మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు

11అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది

12ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో

13వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు

14(వారితో ఇలా అనబడుతుంది): "మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే

15ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా

16ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది

17నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు

18వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు

19(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి

20వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము

21మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము. మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు

22మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము

23అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు

24మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు, వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు

25మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు

26వారు ఇలా అంటారు: "వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము

27కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు

28నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి, అపార కరుణా ప్రదాత

29కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు

30లేదా? వారు: "ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా

31వారితో ఇలా అను: "మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను

32ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా

33ఏమీ? వారు: "ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు

34వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను

35వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా

36లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు

37వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా

38వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను

39ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా

40(ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి

41లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా

42లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు

43లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు

44ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: "ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు

45కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు

46ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు

47మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది, కాని వారిలో చాలా మందికి అది తెలియదు

48కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి

49మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను

మూలం: Abdul Raheem Mohammad Moulana

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath