37. అస్-సాఫాత్
1వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా
2మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా
3ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా
4నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే
5ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు
6నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము
7మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి
8ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు
9(ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది
10కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది
11అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము
12వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు
13మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు
14మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు
15మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే
16ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా
17ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
18వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు
19నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు
20మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం
21(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే
22(దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని
23అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి
24మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది
25మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు
26అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు
27మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు
28కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు
29ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు
30మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు
31కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము
32కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి
33అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు
34నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము
35వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు
36మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా
37వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు
38నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు
39మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు
40ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
41అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది
42అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు
43పరమ సుఖాలు గల స్వర్గవనాలలో
44ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు
45వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి
46అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది
47దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు
48మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు
49వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు
50అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు
51వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు
52అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా
53ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా
54అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా
55తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు
56అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే
57ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని
58(తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా
59మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా
60నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)
61ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి
62ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా
63నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము
64నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు
65దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి
66నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు
67తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది
68ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది
69నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు
70మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని
71మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు
72మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము
73ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో
74ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప
75మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము
76మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము
77మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము
78మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
79సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)
80నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము
81నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు
82తరువాత మేము ఇతరులను ముంచి వేశాము
83మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు
84అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి
85అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు
86ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా
87అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి
88ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు
89అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు
90కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు
91తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి
92మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు
93తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు
94అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు
95అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా
96వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా
97వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి
98కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము
99మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు
100(అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు
101కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము
102ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు
103ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు
104మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్
105వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము
106నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష
107మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము
108మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము
109ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)
110ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
111నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు
112మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త
113మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు
114మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము
115మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము
116మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు
117మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము
118మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము
119మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము
120మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)
121నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
122నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు
123మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు
124అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా
125ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా
126అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా
127కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు
128ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
129తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము
130ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)
131నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము
132నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు
133మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు
134ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో
135ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది
136ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము
137మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు
138మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా
139మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు
140అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు
141అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు
142ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు
143అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే
144దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు
145ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము
146మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము
147మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము
148వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము
149అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా
150లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా
151అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు
152అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు
153ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా
154మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు
155ఏమీ? మీరు గ్రహించలేరా
156లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా
157మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి
158మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని
159వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)
160ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప
161ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి)
162ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు
163భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప
164(దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు
165మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము
166మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే
167మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు
168ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే
169మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము
170కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు
171మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది
172నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని
173మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని
174కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు
175మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
176ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా
177కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు
178కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు
179మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు
180నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు
181మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)
182మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath