15. అల్-హిజ్ర్
1అలిఫ్ - లామ్ - రా. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్
2సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు
3వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు
4మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు
5ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు
6మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు
7నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు
8మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు
9నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము
10మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము
11మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు
12ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము
13వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది
14మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ
15ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది
16మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము
17మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా ఉంచాము
18కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది
19మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము
20మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము
21మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము
22మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు
23మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము
24మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు
25మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు
26మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము
27మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము
28మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను
29ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి
30అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు
31ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు
32(అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు
33(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను
34(అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు
35మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది
36(ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు
37(అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు
38(నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు
39(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను
40వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప
41(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం
42నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప
43మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే
44దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు
45నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు
46వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు
47వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు
48అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు
49నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను
50మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష
51మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు
52వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది
53వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము
54(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు
55వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు
56(ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు
57(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి
58వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము
59లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము
60అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము
61తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు
62(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు
63వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము
64మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము
65కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి
66మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు
67మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు
68(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి
69మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి
70వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా
71(లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు
72నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు
73ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది
74తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము
75నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి
76మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది
77నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది
78మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు
79కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి
80మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు
81మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు
82మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు, సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)
83చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది
84అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది
85మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు
86నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు
87మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము
88వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు
89మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే
90ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో
91ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో
92నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము
93వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి
94కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు
95నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు
96ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు
97మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు
98కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు
99మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath