క్రైస్తవం
వెనక్కి

కీర్తనలు 71

1యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు.

2నన్ను రక్షించు. నీ నీతిని బట్టి నన్ను భద్రపరచు. శ్రద్ధగా ఆలకించి నన్ను రక్షించు.

3నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు.

4నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు.

5నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.

6నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.

7నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.

8నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.

9ముసలితనంలో నన్ను విడిచిపెట్టకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదలకు.

10నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నవారు కూడబలుక్కుంటున్నారు.

11దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, వాణ్ణి తప్పించేవాడు ఎవరూ లేరు. వాణ్ణి తరిమి పట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు.

12దేవా, నాకు దూరంగా ఉండవద్దు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా బయలుదేరు.

13నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.

14నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.

15నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.

16ప్రభువైన యెహోవా బలమైన కార్యాలను నేను వర్ణించడం మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వివరిస్తాను.

17దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను.

18దేవా, నేను తల నెరిసి ముసలివాడినైనా నన్ను విడిచిపెట్టకు. రాబోయే తరాలకు నీ బలప్రభావాల గురించి, ఇకపై పుట్టబోయే వాళ్లకు నీ శక్తియుక్తులను గురించి వివరిస్తాను.

19దేవా, నీ నీతి ఎత్తయిన ఆకాశాలకన్నా ఉన్నతమైనది. ఘన కార్యాలు చేసిన దేవా, నీకు సాటి ఎవరు?

20ఎన్నో కఠిన బాధలు మాకు కలిగేలా చేసిన దేవా, నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవించేలా చేస్తావు. అగాధ లోయల్లో నుండి మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు.

21నా గొప్పతనాన్ని వృద్ధిచెయ్యి. నావైపు తిరిగి నన్ను ఆదరించు.

22నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను.

23నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు.

24అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath