కీర్తనలు 31
1యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు.
2నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు.
3నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు.
4నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే.
5నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.
6నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం.
7నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు.
8నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.
9యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
10నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
11నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు.
12చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను.
13చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
14అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.
15నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు.
16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు.
17యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ.
18అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.
19నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
20మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
21ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక.
22నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు.
23యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
24యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath