క్రైస్తవం
వెనక్కి

కీర్తనలు 106

1యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.

2యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?

3న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.

4యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ,

5నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు.

6మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.

7ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు.

8అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు.

9ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు.

10పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు.

11నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు.

12అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు.

13అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు.

14అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు.

15వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు.

16వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు.

17భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.

18వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.

19హోరేబులో వారు దూడను చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహానికి మొక్కారు.

20తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు.

21ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను

22ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు.

23అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.

24రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు.

25యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు.

26అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి,

27అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి, దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు.

28వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు.

29వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది.

30ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది.

31నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది.

32మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది.

33ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు.

34యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు.

35అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.

36వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.

37వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.

38నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.

39తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.

40కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.

41ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పగవారు వారిని ఏలారు.

42శత్రువులు వారిని బాధపెట్టారు. వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు.

43అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ పాపం మూలంగా హీనదశకు వెళ్ళిపోయారు.

44అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.

45వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు.

46వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.

47యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.

48ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్‌ అందురు గాక. యెహోవాను స్తుతించండి.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath