సామెతలు 15
1సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.
2జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.
3యెహోవా కళ్ళు లోకమంతా చూస్తూ ఉంటాయి. చెడ్డవాళ్ళని, మంచివాళ్ళని అవి చూస్తూ ఉంటాయి.
4మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.
5మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.
6నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.
7జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.
8భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.
9దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.
10సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు.
11మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా?
12అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.
13ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
14తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.
15దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.
16విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.
17ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
18ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.
19సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
20జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.
21బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.
22సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.
23సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!
24వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు.
25గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.
26దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి.
27లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.
28నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.
29భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.
30కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.
31జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.
32క్రమశిక్షణ అంగీకరించని వాడు తనను తాను ద్వేషించు కుంటున్నాడు. దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకం గలవాడు.
33యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath