క్రైస్తవం
వెనక్కి

సామెతలు 10

1జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.

2భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.

3ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.

4శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.

5బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.

6నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.

7నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.

8జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

9నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.

10కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

11నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు.

12ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

13వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.

14జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.

15ధనవంతుల ఆస్తి వారికి ఆశ్రయం కలిగించే కోట. దరిద్రుని పేదరికం వాడి నాశనానికి కారణం.

16నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది.

17బుద్ధిగల మాటలకు లోబడేవాడు తనకు జీవం కలిగించుకుంటాడు. మందలింపుకు సమ్మతించని వాడు దారి తప్పి నాశనం అవుతాడు.

18అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

19వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.

20ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి.

21నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.

22యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.

23మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు.

24మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.

25సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు.

26సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.

27యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం అధిక ఆయుష్షు ఇస్తుంది. భక్తిహీనుల జీవితకాలం తరిగిపోతూ ఉంటుంది.

28నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.

29నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.

30ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు.

31ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.

32ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath