సంఖ్యాకాండం 33
1మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
2యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
3మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
4ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
5ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
6సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
7ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
8పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
9ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
10ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
11అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
12సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
13దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
14ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
15రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
16అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
17కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
18హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
19రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
20రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
21లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
22రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
23కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
24షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
25హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
26మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
27తాహతు నుండి తారహుకు వచ్చారు.
28తారహు నుండి మిత్కాకు వచ్చారు.
29మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
30హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
31మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
32బెనేయాకాను నుండి హోర్హగ్గిద్గాదుకు వచ్చారు.
33హోర్హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
34యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
35ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
36ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
37కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
38యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
39అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
40అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
41వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
42సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
43పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
44ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
45ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
46దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
47అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
48అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
49వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
50యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
51“నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
52ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
53ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
54మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
55అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
56అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath