నెహెమ్యా 5
1తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
2కొందరు వచ్చి “మేమూ, మా కొడుకులూ కూతుళ్ళు చాలామంది ఉన్నాం. మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు” అన్నారు.
3మరి కొంతమంది “కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను, మా ఇళ్ళను తాకట్టు పెట్టాం, కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి” అన్నారు.
4మరికొందరు “రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను, ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాం.
5మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు.
6ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది.
7అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను.
8“ఇతర ప్రజలకు అమ్ముడుబోయిన మన సోదర యూదులను మా శక్తి కొద్దీ విడిపించాం. మళ్ళీ మన సాటి యూదులు అమ్ముడుబోయేలా మీరు చేస్తున్నారా?” అని వారితో అన్నాను. వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు.
9నేను ఇలా అన్నాను “మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా?
10నేనూ నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం.
11ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.”
12అప్పుడు వాళ్ళు “నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం” అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళచేత ప్రమాణం చేయించాను.
13నేను నా దుప్పటి దులిపి “ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వ్యక్తినీ అతని ఇంట్లో, ఆస్తిలో పాలు లేకుండా దేవుడు దులిపి వేస్తాడు గాక. ఆ విధంగా అలాంటివాడు దులిపి వేసినట్టుగా అన్నీ పోగొట్టుకుంటాడు” అని చెప్పాను. సమాజమంతా “అలాగే జరుగుతుంది గాక” అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా ఈ వాగ్దానం ప్రకారం చేశారు.
14నేను యూదా దేశంలో వారికి అధికారిగా వచ్చినప్పటినుండి, అంటే అర్తహషస్త రాజు పాలనలో 20 వ సంవత్సరం నుండి 32 వ సంవత్సరం దాకా ఈ 12 సంవత్సరాలు అధికారిగా నాకు రావలసిన ఆహార పదార్థాలను నేను గానీ, నా బంధువులు గానీ తీసుకోలేదు.
15అయితే నాకు ముందున్న అధికారులు ప్రజల నుండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాల వెండి చొప్పున తీసుకుంటూ వచ్చారు. వారి సేవకులు కూడా ప్రజలపై ఆధికారం చెలాయించేవారు. అయితే దేవుని పట్ల భయభక్తులు ఉన్న కారణంగా నేనలా చేయలేదు.
16నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలసి పని చేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు.
17నా భోజనం బల్ల దగ్గర మా చుట్టూ ఉన్న అన్యదేశాల నుండి వచ్చిన ప్రజలతోపాటు యూదులు, అధికారులు మొత్తం 150 మంది మాతో కలసి భోజనం చేసేవాళ్ళు.
18నా కోసం ప్రతి రోజూ ఒక ఎద్దు, ఆరు శ్రేష్ఠమైన గొర్రెలు భోజనం కోసం సిద్ధం చేసేవారు. ఇవి కాకుండా పిట్టలు, పది రోజులకొకసారి రకరకాల ద్రాక్షారసాలు సమృద్ధిగా సిద్ధపరిచే వారు. అయినప్పటికీ ఈ ప్రజలు ఎంతో కఠినమైన బానిసత్వం కింద ఉన్నందువల్ల అధికారిగా నాకు రావలసిన రాబడి నేను ఆశించలేదు.
19నా దేవా, నేను ఈ ప్రజల కోసం చేసిన అన్ని రకాల ఉపకారాలనుబట్టి నన్ను జ్ఞాపకముంచుకుని కరుణించు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath