లూకా రాసిన సువార్త 6
1ఒక విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు.
2అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, “విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు” అని వారినడిగారు.
3యేసు వారితో ఇలా అన్నాడు, “దావీదుకీ, అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేశాడో అది కూడా మీరు చదవలేదా?
4అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని, తనతో ఉన్నవారికీ ఇచ్చాడు కదా!” అన్నాడు.
5ఇంకా ప్రభువు, “అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని” అని వారితో చెప్పాడు.
6మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు.
7ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఎవరినైనా బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు.
8వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యి గలవాడితో, “నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు” అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు.
9అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? లేక కీడు చేయడం న్యాయమా? ప్రాణాన్ని రక్షించడం న్యాయమా? లేక హత్య చేయడం న్యాయమా? అని మిమ్మల్ని అడుగుతున్నాను” అని వారితో చెప్పి
10చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి, “నీ చెయ్యి చాపు” అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.
11అప్పుడు వారు వెర్రి కోపంతో నిండి పోయి యేసును ఏమి చేయాలా అని తమలో తాము చర్చించుకున్నారు.
12ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.
13ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు.
14వారు ఎవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
15మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను,
16యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.
17ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు.
19రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు.
20అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు, “పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది.
21“ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది. “ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
22“మనుష్యకుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు.
23ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.
24“అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు.
25అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు యాతన. మీకు ఆకలి వేస్తుంది. అయ్యో, ఇప్పుడు నవ్వుతున్న మీకు యాతన. మీరు దుఃఖించి ఏడుస్తారు.
26మనుషులంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు యాతన. వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్త లకు అలాగే చేశారు.
27“వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి.
28మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.
29నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు.
30అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు.
31మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
32మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా.
33మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!
34మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
35మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు.
36మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.
37ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి. అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది.
38ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”
39తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా?
40శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు.
41నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు?
42నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో, ‘సోదరా, నీ కంట్లో నలుసు తీసివేయనియ్యి’ అని నువ్వెలా చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివెయ్యి. అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
43మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు.
44ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు. రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోయరు.
45మంచి మనిషి తన హృదయమనే ధననిధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది.
46నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు?
47“నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి.
48వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది.
49అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ ఇంటి నాశనం ఎంతో దయనీయం.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath