లేవీకాండం 27
1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
2“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఎవరన్నా విశేషమైన మ్రొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి.
3నీవు నిర్ణయించవలసిన వెల ఇది. ఇరవై ఏళ్ళు మొదలు అరవై ఏళ్ల వయస్సు వరకూ పురుషుడికి పరిశుద్ధ స్థలం తులం లెక్క ప్రకారం ఏభై తులాల వెండి నిర్ణయించాలి.
4స్త్రీకి ముప్ఫై తులాలు నిర్ణయించాలి.
5ఐదేళ్ళు మొదలు ఇరవై ఏళ్ల లోపలి వయస్సు గల పురుషుడికి ఇరవై తులాల వెలను, స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.
6ఒక నెల మొదలు ఐదేళ్ళ లోపు వయస్సుగల పురుషుడికి ఐదు తులాల వెండి వెలను స్త్రీకి మూడు తులాల వెండి వెలను నిర్ణయించాలి.
7అరవై ఏళ్ల వయసు దాటిన పురుషుడికి పదిహేను తులాల వెలను స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.
8ఎవరైనా నీవు నిర్ణయించిన వెల చెల్లించలేనంత పేద వాడైతే అతడు యాజకుని ఎదుటికి రావాలి. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్న వాడి తాహతు చొప్పున వాడికి వెలను నిర్ణయించాలి.
9యెహోవాకు అర్పణంగా అర్పించే పశువుల్లో ప్రతిదాన్నీ యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచాలి.
10దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి బదులు మంచిదాన్ని గానీ మంచిదానికి బదులు చెడ్డదాన్ని గానీ ఒక దానికి బదులు మరొక దాన్నిగానీ ఇయ్యకూడదు. మొక్కుకున్న జంతువుకు బదులు వేరొక జంతువును మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినదీ కూడా ప్రతిష్ఠితం అయిపోతుంది.
11ప్రజలు యెహోవాకు అర్పించకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తెస్తే ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టాలి.
12అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెలను నిర్ణయించాలి. యాజకుడివైన నీవు నిర్ణయించిన వెల ఖాయం.
13అయితే ఎవరైనా అలాటి జంతువును విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి.
14ఎవరైనా తన ఇల్లు యెహోవాకు సమర్పించడానికి దాన్ని ప్రతిష్ఠించినట్టయితే అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెల నిర్ణయించాలి. యాజకుడు నిర్ణయించిన వెల ఖాయం అవుతుంది.
15తన ఇల్లు దేవునికి అర్పించిన వాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి. అప్పుడు ఆ ఇల్లు అతనిదవుతుంది.
16ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే దానిలో చల్లే విత్తనాల కొలత చొప్పున దాని వెల నిర్ణయించాలి. పది తూముల బార్లీ విత్తనాలకు ఏభై తులాల వెండి నిర్ణయించాలి.
17అతడు సునాద సంవత్సరం మొదలు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే నీవు నిర్ణయించే వెల ఖాయం.
18సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే యాజకుడు మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున, అంటే మరుసటి సునాద సంవత్సరం వరకూ ఉన్న సంవత్సరాలను బట్టి వెలను నిర్ణయించాలి. నీవు నిర్ణయించిన వెలలో దాని అంచనాను తగ్గించాలి.
19పొలాన్ని ప్రతిష్ఠించినవాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతును అతడు దానితో కలపాలి. అప్పుడు అది అతనిదవుతుంది.
20అతడు ఆ పొలాన్ని విడిపించకపోతే లేదా దాన్ని వేరొకడికి అమ్మితే ఇక ఎన్నటికీ దాన్ని విడిపించడం వీలు కాదు.
21ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదల అయితే అది ప్రతిష్ఠించిన పొలం లాగానే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఆ ఆస్తి యాజకునిది అవుతుంది.
22ఒకడు తాను కొన్న పొలాన్ని, అంటే తన ఆస్తిలో చేరని దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే
23యాజకుడు సునాద సంవత్సరం వరకూ నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమించాలి. ఆ రోజునే నీవు నిర్ణయించిన వెల చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాని చెల్లించాలి.
24సునాద సంవత్సరంలో ఆ భూమి ఎవరి పిత్రార్జితమో వాడికి, అంటే ఆ పొలాన్ని అమ్మిన వాడికి అది తిరిగి రావాలి.
25నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం వెల చొప్పున నిర్ణయించాలి. ఒక తులం ఇరవై చిన్నాలు.
26జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనక ఎవరూ దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు అయినా గొర్రెమేకల మందలోనిదైనా యెహోవాదే.
27అది అపవిత్ర జంతువైతే వాడు నీవు నిర్ణయించే వెలలో ఐదో వంతు దానితో కలిపి దాని విడిపించవచ్చు. దాని విడిపించకపోతే నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మాలి.
28అయితే మనుషుల్లోగాని జంతువుల్లోగాని సొంత పొలంలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్టించినట్టయితే ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపించ కూడదు. ప్రతిష్ఠించిన ప్రతిదీ యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉంటుంది.
29మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైనా విడిపించకుండా చంపి వేయాలి.
30ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.
31ఒకడు తాను చెల్లించవలసిన దశమభాగాల్లో దేనినైనా విడిపించుకోవాలి అనుకుంటే దానిలో ఐదో వంతును దానితో కలపాలి.
32ఆవుల్లోగాని, గొర్రె మేకల్లోగాని, కాపరి కర్రతో తోలే వాటన్నిటిలో దశమభాగం ప్రతిష్ఠితం అవుతుంది.
33అది మంచిదో చెడ్డదో పరీక్ష చెయ్యకూడదు, దాన్ని మార్చకూడదు. దాని మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితాలు అవుతాయి. అలాటి దాన్ని విడిపించ కూడదు అని చెప్పు.”
34ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath