లేవీకాండం 23
1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
2“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. మీరు చాటించ వలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఈ కాలాల్లో మీరు పరిశుద్ధ సమూహాలుగా సమకూడాలి. నా నియామక కాలాలు ఇవి.
3ఆరు రోజులు పనిచెయ్యాలి. వారంలో ఏడవ రోజు విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘ దినం. అందులో మీరు ఏ పనీ చేయకూడదు. మీ ఇళ్ళన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం.
4ఇవి యెహోవా నియామక కాలాలు. వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి.
5మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.
6ఆ నెల పదిహేనో రోజున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగుతుంది. ఏడు రోజుల పాటు మీరు పొంగని వంటకాలే తినాలి.
7మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు.
8ఏడు రోజులు మీరు యెహోవాకు హోమ బలి చేయాలి. ఏడవ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదని వారితో చెప్పు.”
9యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు
10“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి.
11యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి.
12మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి.
13దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక లీటర్ ద్రాక్షారసం.
14మీరు మీ దేవునికి అర్పణం తెచ్చేదాకా ఆ దినమంతా మీరు రొట్టె, పేలాలు, పచ్చని వెన్నులు, మొదలైనవి ఏమీ తినకూడదు. ఇది మీ తరతరాలకు మీ నివాసాలన్నిటిలో నిత్య శాసనం.
15మీరు విశ్రాంతి రోజుకు మరునాడు మొదలు, అంటే కదిలించే పనను మీరు తెచ్చిన దినం మొదలు కుని ఏడు వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారాలు ఉండాలి.
16ఏడవ విశ్రాంతి దినం మరుసటి దినం వరకూ మీరు ఏభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి.
17మీరు మీ ఇళ్ళలో నుండి తూములో రెండేసి పదివంతుల పిండితో చేసిన రెండు రొట్టెలను కదిలించే అర్పణంగా తేవాలి. వాటిని గోదుమపిండితో చేసి పొంగేలా కాల్చాలి. అవి యెహోవాకు ప్రథమఫలాల అర్పణం.
18మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లలు ఏడింటిని, ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోను వారి పానార్పణాలతోను దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది.
19అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపపరిహార బలిగా అర్పించి రెండు ఏడాది వయసున్న గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పించాలి.
20యాజకుడు ప్రథమఫలాల రొట్టెలతో ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు. అవి యాజకునివి.
21ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. అ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.
22మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.”
23యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
24“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి.
25ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.”
26యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
27“ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి.
28ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం.
29ఆ రోజున తనను దుఃఖపరుచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
30ఆ రోజున ఏ పని అయినా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండాా నాశనం చేస్తాను.
31ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.
32అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.”
33యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
34“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.
35వాటిలో మొదటి రోజున మీరు పరిశుద్ధసంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
36ఏడు రోజులు మీరు యెహోవాకు హోమం చేయాలి. ఎనిమిదో రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది మీకు వ్రతదినం. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
37ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమ బలులు, దహన బలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించడానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి.
38యెహోవా నియమించిన విశ్రాంతి దినాలకు, మీరు కానుకలు ఇచ్చే రోజులకు, మీ మొక్కుబడి రోజులకు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలిచ్చే రోజులకు ఇవి అదనం.
39అయితే ఏడో నెల పదిహేనో రోజున మీరు పంట సమకూర్చుకునేటప్పుడు ఏడు రోజులు యెహోవాకు ఉత్సవం చెయ్యాలి. మొదటిరోజు, ఎనిమిదవ రోజు విశ్రాంతి దినాలు.
40మొదటి రోజున మీరు దబ్బ కాయలు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలవల ఒడ్డున ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు తెచ్చి ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సవం చేసుకోవాలి.
41అలా మీరు ఏటేటా ఏడు రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. ఏడవ నెలలో దాన్ని ఆచరించాలి.
42నేను ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేసానని మీ ప్రజలకు తెలిసేలా ఏడు రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి.
43నేను మీ దేవుడైన యెహోవాను.”
44ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath