క్రైస్తవం
వెనక్కి

యెహోషువా 22

1యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇలా అన్నాడు,

2“యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు. నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విన్నారు.

3ఇన్నిరోజులనుండి ఇప్పటి వరకూ మీరు మీ సోదరులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

4ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సోదరులకు వాగ్దానం చేసిన ప్రకారం వారికి నెమ్మది కలగజేశాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడు మోషే, యొర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలోని మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి.

5అయితే మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గాలన్నిటిలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను హత్తుకుని సేవిస్తూ, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి.”

6అతడిలా చెప్పి వారిని దీవించి పంపివేశాడు. తరువాత వారు తమ నివాసాలకు వెళ్ళిపోయారు.

7మోషే బాషానులో మనష్షే అర్థగోత్రానికీ యెహోషువ పడమరగా యొర్దాను ఇవతల వారి సోదరుల్లో మిగిలిన అర్థగోత్రానికీ స్వాస్థ్యం ఇచ్చారు. యెహోషువ వారి నివాసాలకు వారిని పంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు,

8“మీరు చాలా ధనంతో అతి విస్తారమైన పశువులూ వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, అతి విస్తారమైన వస్త్రాలతో మీ నివాసాలకు తిరిగి వెళ్తున్నారు. మీ శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్మును మీరు, మీ సోదరులు కలిసి పంచుకోండి.”

9కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారు యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్యభూమి అయిన గిలాదుకు వెళ్లడానికి కనాను ప్రాంతంలోని షిలోహులోని ఇశ్రాయేలీయుల దగ్గర నుండి బయలుదేరారు. కనాను ప్రాంతంలో ఉన్న యొర్దాను ప్రదేశానికి వచ్చినప్పుడు

10రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపు వారు అక్కడ యొర్దాను నది దగ్గర ఒక బలిపీఠం కట్టారు. అది చూడడానికి గొప్ప బలిపీఠమే.

11అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఇశ్రాయేలీయుల సరిహద్దు దగ్గర యొర్దాను ప్రదేశంలో కనాను ప్రాంతం ఎదురుగా బలిపీఠం కట్టారని ఇశ్రాయేలీయులకు సమాచారం వచ్చింది.

12ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుధ్ధం చేయడానికి షిలోహులో పోగయ్యారు.

13ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారి దగ్గరికి యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును పంపించారు.

14అతనితో ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో ప్రతిదానికీ ఒకరి చొప్పున పదిమంది ప్రముఖులను పంపించారు. వారంతా ఇశ్రాయేలీయులకు ప్రతినిధులు, తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు.

15వారు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థ గోత్రం వారితో ఇలా అన్నారు,

16“యెహోవా సర్వసమాజం వారు ఇలా అంటున్నారు, ‘ఈ రోజు యెహోవాను అనుసరించడం మాని, మీ కోసం బలిపీఠం కట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు?

17పెయోరు పర్వతంలో మనం చేసిన దోషం మనకు సరిపోదా? దానివల్ల యెహోవా సమాజంలో తెగులు పుట్టింది. ఇంకా మనం దానినుండి శుద్ధులం కాలేదు.

18ఈ రోజు మీరు కూడా యెహోవాను అనుసరించడం మానివేస్తారా? మీరు కూడా ఈ రోజు యెహోవా మీద తిరుగుబాటు చేస్తే రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీదా కోపిస్తాడు.

19మీ స్వాధీనమైన ప్రదేశం అపవిత్రమైనది అయితే యెహోవా ప్రత్యక్షపు గుడారం ఉండే ప్రదేశానికి వచ్చి మా మధ్య స్వాస్థ్యం తీసుకోండి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠం కట్టి యెహోవా మీదా, మామీదా తిరగబడవద్దు.

20జెరహు కుమారుడు ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయంలో ద్రోహం చేసినందు వలన ఇశ్రాయేలీయుల సమాజమంతటి మీదికి ఉగ్రత రాలేదా? తన దోషానికి అతడొక్కడే నాశనం కాలేదు కదా.’”

21అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులకు ఇలా జవాబిచ్చారు,

22“యెహోవాయే గొప్ప దేవుడు! యెహోవాయే గొప్ప దేవుడు! ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగానీ యెహోవా మీద తిరుగుబాటు చేతగానీ మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వవద్దు.

23యెహోవాను అనుసరించకుండా దహనబలి గానీ నైవేద్యం గానీ సమాధాన బలులు గానీ దానిమీద అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టి ఉంటే యెహోవాయే మమ్మల్ని శిక్షిస్తాడు గాక!

24రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలతో, ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం?

25మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దుగా చేశాడు. రూబేనీయులారా, గాదీయులారా, మీకు యెహోవాతో సంబంధం లేదు’ అంటారేమో అని భయపడి మేమిలా చేశాం. మీ పిల్లలు మా పిల్లలను యెహోవాను సేవించకుండా చేస్తారేమో.

26కాబట్టి మేము, ‘మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహనబలులకూ మరి ఎలాటి బలులకూ కాదు.

27మన దహనబలులూ బలులతో సమాధాన బలులతో మనం యెహోవాకు సేవచేయాలనీ, యెహోవా దగ్గర మీకు పాలు ఏదీ లేదు అనే మాట మీ పిల్లలు మా పిల్లలతో ఎన్నడూ చెప్పకుండా అది మాకు మీకు, మన తరవాతి తరాల వారి మధ్య సాక్షిగా ఉంటుంది’ అనుకున్నాము.”

28“కాబట్టి ఇక మీదట వారు మాతో గాని మా సంతానంతో గాని అలా అంటే, మేము ‘మన పూర్వీకులు చేసిన బలిపీఠపు ఆకారం చూడండి, ఇది దహనబలులూ, బలి అర్పణలూ అర్పించడానికి కాదు, మాకు మీకు మధ్య సాక్షిగా ఉండడానికే’ అని చెప్పాలని అనుకున్నాం.

29మన దేవుడైన యెహోవా ప్రత్యక్షపు గుడారం ఎదురుగా ఉన్న ఆయన బలిపీఠం తప్ప దహనబలులకు గానీ నైవేద్యాలకు గానీ బలులకు గానీ వేరొక బలిపీఠాన్ని కట్టి, ఈ రోజు యెహోవాను అనుసరించకుండా తొలగిపోయి ఆయన మీద తిరగబడడం మాకు దూరమవుతుంది గాక.”

30రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు చెప్పిన మాటలు యాజకుడైన ఫీనెహాసు, ప్రజల నాయకులు, అంటే అతనితో ఉన్న ఇశ్రాయేలీయుల పెద్దలు విని సంతోషించారు.

31అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, రూబేనీయులతో గాదీయులతో మనష్షీయులతో “మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మన మధ్య ఉన్నాడని ఈ రోజు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించారు” అని చెప్పాడు.

32అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, ఆ నాయకులూ గిలాదులోని రూబేను, గాదు గోత్రాల నుండి ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వచ్చి ప్రజలకు ఆ మాట తెలియచేశారు.

33అది విని ఇశ్రాయేలీయులు సంతోషించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులు గాదీయులు నివసించే ప్రదేశాన్ని పాడు చేయకుండా వారి మీద యుధ్ధం చేయడం ఆపేశారు.

34రూబేనీయులు, గాదీయులు “యెహోవాయే దేవుడు అనడానికి ఆ బలిపీఠం మన మధ్య సాక్షి” అని చెప్పి దానికి “సాక్షి ” అనే పేరు పెట్టారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath