క్రైస్తవం
వెనక్కి

యోనా 1

1యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు.

2“నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”

3కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.

4అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.

5అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.

6అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.

7అంతలో నావికులు “ఎవర్ని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో తెలుసుకోడానికి మనం చీట్లు వేద్దాం రండి” అని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేశారు. చీటీ యోనా పేరున వచ్చింది.

8కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది ఏ దేశం? ఏ జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు.

9అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.”

10వాళ్ళు మరింత భయపడి అతనితో “నువ్వు చేసిన పని ఏమిటి?” అన్నారు. ఎందుకంటే తాను యెహోవా సన్నిధినుంచి పారిపోతున్నట్టు అతడు వాళ్లకు చెప్పాడు.

11అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది.

12యోనా “నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళిస్తుంది” అని వాళ్లకు జవాబిచ్చాడు.

13అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు.

14కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా మొర్రపెట్టారు. “ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యవద్దు. అతని చావుకు మా మీద దోషం మోప వద్దు. ఎందుకంటే యెహోవా, నువ్వే నీ ఇష్టప్రకారం ఇలా జరిగించావు.”

15ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది.

16అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి, ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్లు చేశారు.

17ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath