క్రైస్తవం
వెనక్కి

యోబు 7

1భూమి మీద మనుషులు జీవించే కాలం కాయకష్టం వంటిది కాదా? వాళ్ళ దినాలు కూలి పని చేసే వాడి జీవనం వంటిది కాదా?

2బానిసత్వంలో ఉన్నవాడు గూడు కోరుకున్నట్టు, కూలి కోసం పనివాడు ఎదురు చూస్తున్నట్టు నేను ఉన్నాను.

3నా ఆశలు నెరవేరక నెలల తరబడి గడపవలసి వచ్చింది. నా కోసం ఆయాసంతో కూడిన రాత్రులు నియమితమై ఉన్నాయి.

4నేను పండుకున్నప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు నిద్ర నుండి లేస్తానా అనుకుంటాను. తెల్లవారే వరకూ ఇటూ అటూ దొర్లుతూ మధనపడతాను.

5నా శరీరమంతా పురుగులతో, మట్టిపెళ్లలతో కప్పి ఉంది. నా చర్మంపై గడ్డలు గట్టిపడి మళ్ళీ మెత్తగా అయిపోయి బాధ పెడతాయి.

6నేత పనివాడి చేతిలోని నాడెలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి.

7నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచీ కనబడదు.

8నన్ను చూసినవారి కళ్ళకు ఇకపై నేను కనిపించను. నీ కళ్ళు నా కోసం చూసినప్పుడు నేను లేకుండా పోతాను.

9మేఘాలు చెదిరిపోయి మాయమైపోయిన విధంగా పాతాళానికి దిగిపోయిన వాడు మళ్లీ పైకి రాడు.

10ఇక అతడు ఎప్పటికీ తన ఇంటికి తిరిగి రాడు. అతడు నివసించిన స్థలం ఇక అతణ్ణి గుర్తించదు.

11అందువల్ల నేను నోరు మూసుకుని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను.

12నేనేమైనా సముద్రం వంటివాడినా? సముద్ర రాక్షసినా? నన్ను నువ్వెందుకు కాపలా కాస్తున్నావు?

13నా పడక నాకు ఆధారం అవుతుందని, నా పరుపు నా బాధకు ఉపశమనం కలిగిస్తుందని అనుకున్నాను.

14అయితే నువ్వు కలలు రప్పించి నన్ను బెదిరిస్తున్నావు. దర్శనాల ద్వారా నేను వణికిపోయేలా చేస్తున్నావు.

15అందుకని నన్ను ఉరి తీయాలని కోరుతున్నాను. నా అస్థిపంజరాన్ని నేను చూసుకోవడం కన్నా చనిపోవడమే నాకు ఇష్టం.

16జీవితం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బతికి ఉండడం నాకు ఇష్టం లేదు. నా జోలికి రావద్దు. నేను బతికే దినాలు ఆవిరిలాగా ఉన్నాయి.

17మనిషి ఎంతటి వాడు? మనిషిని గొప్పవాడిగా ఎంచడం ఎందుకు? అతని మీద నీ మనస్సు నిలపడం ఎందుకు?

18ప్రతి ఉదయమూ నువ్వు అతణ్ణి దర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతన్ని పరీక్షిస్తావెందుకు?

19నన్ను చూస్తూ నువ్వు ఎంతకాలం గడుపుతావు? నేను గుటక వేసే వరకూ నన్ను విడిచిపెట్టవా?

20మనుషులను కనిపెట్టి చూసే వాడా, ఒకవేళ నేను పాపం చేసినా అది నీకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తాను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీ దృష్టి నాపై ఎందుకు నిలిపావు?

21నా అతిక్రమాలను నువ్వెందుకు క్షమించవు? నా పాపాలను ఎందుకు తుడిచివేయవు? నేనిప్పుడు మట్టిలో కలసిపోతాను. నన్ను జాగ్రత్తగా వెదకుతావు గానీ నేను ఉండను.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath