క్రైస్తవం
వెనక్కి

యోబు 4

1అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.

2ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు?

3నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు.

4దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు.

5అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు.

6నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా?

7జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా?

8నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు.

9దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు.

10సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి.

11తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి.

12నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది.

13మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది.

14నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి.

15ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి.

16ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం “దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా?

17తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది.

18తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు.

19అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు!

20ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు.

21వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath