యోబు 19
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,
2మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు?
3పదిసార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు.
4నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వస్తుంది గదా?
5మిమ్మల్ని మీరే గొప్పచేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా?
6అయితే వినండి. దేవుడు నాపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి.
7నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవ్వరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు న్యాయం జరగడం లేదు.
8ఆయన నా మార్గం చుట్టూ నేను దాట లేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు.
9ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు.
10అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనం అయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు.
11ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు.
12ఆయన సేనలు కూడి వచ్చి నా గుడారం చుట్టూ మాటువేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు.
13ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు.
14నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.
15నా యింటి దాసదాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడి వలే ఉన్నాను.
16నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది.
17నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం.
18చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు.
19నా ప్రాణస్నేహితులందరూ నన్ను చూసి ఆసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు.
20నా ఎముకలు నా చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.
21నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి.
22నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు?
23నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను.
24నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది!
25నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.
26ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను.
27మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.
28దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు.
29అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath