క్రైస్తవం
వెనక్కి

యోబు 15

1అప్పుడు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబు ఇచ్చాడు,

2“జ్ఞానం గలవాడు గాలితో తన కడుపు నింపుకుని తెలివి తక్కువతనంగా వ్యర్ధమైన మాటలు మాట్లాడడం మంచిదేనా?

3వ్యర్థమైన పదాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని మాటలతో వాదించడం ఎందుకు?

4అలాంటి మాటలతో నీకున్న భయభక్తులను హీనపరుస్తున్నావు. నీ దేవుని ధ్యానాన్ని ఆటంకపరుస్తున్నావు.

5నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ పాపాలు బయటపడుతున్నాయి. కపటంగా మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు.

6నేను కాదు, నీ మాటలే నువ్వు నేరం చేశావని ప్రకటిస్తున్నాయి. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి.

7మనిషిగా పుట్టిన వాళ్ళలో మొదటివాడివి నువ్వే అనుకుంటున్నావా? కొండలకన్నా నువ్వు ముందుగా ఉన్నావా?

8నువ్వేమైనా దేవుని సమాలోచన సభలో సభ్యుడివా? నువ్వొక్కడివే జ్ఞానం గలవాడివా?

9మాకు తెలియని విషయాలు నీకేం తెలుసు? మేము గ్రహించలేని విషయాలు నువ్వేం గ్రహించావు?

10మాలో తల నెరసిన వృద్ధులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు.

11దేవుడిచ్చిన ఓదార్పు నీకు తేలికగా అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన మాటలు నీకు మనసులోకి ఎక్కడం లేదా?

12నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబడ్డాయి?

13దేవునిపై నీకెందుకు కోపం వస్తుంది? నీ నోట వెంట అలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి?

14కళంకం లేనివాడు అనిపించుకోడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడుగా ఎలా ఎంచబడతాడు?

15ఆలోచించు, దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ విశాలాలు ఆయన దృష్టికి పవిత్రం కావు.

16అలా ఉండగా, మనుషులు మరింత దుర్మార్గులు. వాళ్ళు నీచులు, దుష్టకార్యాలు చేసేవాళ్ళు, అన్యాయాన్ని నీళ్ళు తాగినట్టు తాగేవాళ్లు.

17నేను చెప్పేది విను. నేను నీకు సంగతులు చెబుతాను. నా అనుభవాలను నీకు వివరిస్తాను.

18జ్ఞానులు తమ పూర్వీకుల ద్వారా నేర్చుకుని, ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశాలు నీకు చెబుతాను.

19జ్ఞానులకే ఆ దేశం వారసత్వంగా ఇవ్వబడింది. అన్యజనులు ఎవ్వరూ ఆ దేశంలో లేరు. ఆ జ్ఞానులు బోధించినది నీకు తెలియజేస్తాను.

20దుర్మార్గుడు తాను బ్రతికినంత కాలం వేదనలు అనుభవిస్తాడు. దుర్మార్గం చేసే వాళ్ళకు నియమించిన సంవత్సరాలన్నిటిలో బాధలు తప్పవు.

21అతడి చెవుల్లో భయంకరమైన శబ్దాలు మారుమ్రోగుతాయి. అతడు క్షేమంగా ఉన్న సమయంలో కీడు చేసేవాడు అతని మీద పడతాడు.

22చీకటిలోనుండి తాను తిరిగి రాగలనన్న నమ్మకం అతనికి ఉండదు. వాడు కత్తివాతకు గురి అవుతాడు.

23‘ఆహారం ఎక్కడ దొరుకుతుంది?’ అనుకుంటూ దాని కోసం తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజులు దాపురించాయని వాడికి తెలుసు.

24యుద్ధం చేయడానికి సన్నద్ధుడై వచ్చిన రాజు శత్రువుని పట్టుకుని బంధించినట్టు బాధ, వేదన అతణ్ణి పట్టుకుని భయకంపితుణ్ణి చేస్తాయి.

25వాడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నాడు.

26మెడ వంచని వైఖరితో మూర్ఖత్వంగా తన దిట్టమైన డాలుతో ఆయన మీదికి దండెత్తుతాడు.

27అతని ముఖమంతా కొవ్వు పేరుకుపోయింది. నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది.

28అలాంటివాడు పాడైపోయిన పట్టణాల్లో నివసిస్తాడు. ఎవ్వరూ నివసించలేని ఇళ్ళలో, శిథిలం కాబోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.

29కాబట్టి వాడు ఎప్పటికీ భాగ్యవంతుడు కాలేకపోతాడు. అతడి ధనం నిలబడదు. అతడి పంటల పైరు బరువెక్కి నేలను తాకేలా కిందకు వంగదు.

30అతడు చీకటి నుండి తప్పించుకోలేడు. అగ్నిజ్వాలలు వాడి లేత కొమ్మలను దహించివేస్తాయి. దేవుని నోటి నుండి వచ్చిన ఊపిరి వాణ్ణి నాశనం చేస్తుంది.

31వాడు వ్యర్ధమైన వాటిని నమ్ముకోకుండా ఉండు గాక. వాడు మోసపోయినవాడు. వాడికి దక్కే ప్రతిఫలం శూన్యం.

32వాడి ఆయుష్షు తీరకముందే ముసలివాడు అయిపోతాడు. వాడు ఎండిపోయిన కొమ్మలాగా వాడిపోతాడు.

33పిందెలు రాలిపోయిన ద్రాక్షచెట్టులాగా, పువ్వులు రాలిపోయిన ఒలీవచెట్టులాగా ఆయన వారిని చేస్తాడు.

34దైవభక్తి లేని భక్తిహీనుల కుటుంబాలు నిర్జీవంగా మారతాయి. లంచగొండుల నివాసాలు అగ్నికి ఆహుతి అవుతాయి.

35వాళ్ళ కడుపులో ఉన్న కపటాన్ని వాళ్ళు బయటకు వెళ్ళగక్కుతారు. వాళ్ళ అంతరంగంలో వంచన నివసిస్తుంది.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath