క్రైస్తవం
వెనక్కి

న్యాయాధిపతులు 7

1యెరుబ్బయలు, (అంటే గిద్యోను) అతనితో ఉన్నవారంతా తెల్లవారే లేచి హరోదు బావి దగ్గరికి వచ్చినప్పుడు లోయలో ఉన్న మోరె కొండకు ఉత్తరంగా మిద్యానీయుల శిబిరం కనబడింది.

2యెహోవా గిద్యోనుతో “నీతో ఉన్నవారు ఎక్కువ మంది. నేను వాళ్ల చేతికి మిద్యానీయులను అప్పగించడం తగదు. ఇశ్రాయేలీయులు, ‘నా కండబలమే నాకు రక్షణ కలుగజేసింది’ అనుకుని తమను తామే గొప్ప చేసుకోవచ్చు.

3కాబట్టి నువ్వు, ‘భయపడి, వణుకుతున్న వాడెవడైనా ఉంటే తొందరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లిపోవాలి’ అని ప్రజలందరూ వినేలా ప్రకటించు” అని చెప్పాడు. అప్పుడు ప్రజల్లోనుంచి ఇరవై రెండు వేలమంది తిరిగి వెళ్లిపోయారు.

4ఇంకా అక్కడ పదివేలమంది ఉన్నారు. యెహోవా “ఈ ప్రజలు ఇంకా ఎక్కువమందే. నీళ్ల దగ్గరికి వాళ్లను దిగేలా చెయ్యి. అక్కడ నీ కోసం వాళ్ల సంఖ్య తగ్గిస్తాను. ‘ఇతను నీతో కలిసి వెళ్ళాలి’ అని ఎవరి గురించి చెబుతానో అతడు నీతో కలిసి వెళ్ళాలి. ‘ఇతడు నీతో కలిసి వెళ్లకూడదు’ అని ఎవరి గురించి చెప్తానో అతడు వెళ్ళకూడదు” అని గిద్యోనుతో చెప్పాడు.

5అతడు నీళ్ల దగ్గరికి ఆ ప్రజలను దిగేలా చేసినప్పుడు యెహోవా “కుక్క తాగినట్టు తన నాలుకతో నీళ్ళు తాగిన వాణ్ణి, నీళ్ళు తాగడానికి మోకాళ్ళు వంచిన వాణ్ణి, వేరువేరుగా ఉంచు” అని గిద్యోనుతో చెప్పాడు.

6చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగినవాళ్ళు మూడు వందల మంది. మిగిలిన వాళ్ళందరు నీళ్లు తాగడానికి మోకాళ్ళు వంచినవాళ్ళే.

7అప్పుడు యెహోవా “చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల మీద జయం ఇస్తాను. తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు” అని గిద్యోనుతో చెప్పాడు.

8ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయినవారి ఆహారం, బూరలు తీసుకున్నారు. యెహోషువా ప్రజలందరినీ వాళ్ళ గుడారాలకు పంపివేశాడు. కాని ఆ మూడువందల మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది.

9ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు “నువ్వు లేచి ఆ శిబిరం మీదికి వెళ్ళు. దాని మీద నీకు జయం ఇస్తాను.

10వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు.

11ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది” అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు.

12మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి.

13గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ “నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది” అన్నాడు.

14అందుకు అతని స్నేహితుడు “అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు” అని జవాబిచ్చాడు.

15గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి,

16ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి.

17చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి.

18నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, ‘యెహోవాకు, గిద్యోనుకు, జయం’ అని కేకలు వెయ్యాలి” అని చెప్పాడు.

19కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు.

20అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని కేకలు వేశారు.

21వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు.

22ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు,

23నఫ్తాలి గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనష్షే గోత్రమంతటిలో నుంచి, పిలుచుకు వచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు.

24గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి “మిద్యానీయులను ఎదుర్కోడానికి రండి. బేత్బారా వరకూ వాగులను, యొర్దాను నది, వాళ్లకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి” అని ముందే చెప్పాడు కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బేత్బారా వరకూ వాగులను యొర్దానును స్వాధీనపరచుకున్నారు.

25వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని, ఓరేబు బండమీద ఓరేబును చంపారు. జెయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జెయేబును చంపి, మిద్యానీయులను తరుముకుంటూ వెళ్ళారు. ఓరేబు, జెయేబుల తలలు యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath