న్యాయాధిపతులు 3
1ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధాల గురించి తెలియని ఇశ్రాయేల్వాళ్ళందరినీ పరీక్షకు గురి చెయ్యడానికి యెహోవా ఈ శత్రు జాతులను అక్కడే ఉంచాడు
2ఇశ్రాయేలీయుల్లో కొత్త తరం వాళ్లకు యుద్ధం నేర్పించడానికి యెహోవా ఉండనిచ్చిన జాతులు ఇవి:
3ఫిలిష్తీయుల ఐదుగురు నాయకుల జాతులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్హెర్మోను నుంచి హమాతునకు వెళ్ళే మార్గం వరకూ లెబానోను కొండలో ఉండే హివ్వీయులు.
4యెహోవా మోషే ద్వారా వాళ్ళ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తారో లేదో తెలుసుకోవాలని ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి ఈ జాతులను ఆయన ఉండనిచ్చాడు.
5కాబట్టి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు,
6పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్య ఇశ్రాయేలీయులు నివాసం చేస్తూ వాళ్ళ కూతుళ్ళను పెళ్లిచేసుకుంటూ, వాళ్ళ కొడుకులకు తమ కూతుళ్ళను ఇస్తూ, వాళ్ళ దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు.
7ఆ విధంగా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా కనబడి, తమ దేవుడైన యెహోవాను మరచి, బయలుదేవుళ్ళను, అషేరా విగ్రహాలను పూజించారు.
8ఫలితంగా యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు ఆయన ఆరాము నహరాయిము రాజైన కూషన్రిషాతాయిము కు బానిసలుగా ఉండడానికి వాళ్ళను అమ్మి వేశాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాలు కూషన్రిషాతాయిముకు బానిసలుగా ఉన్నారు.
9ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కొడుకు ఒత్నీయేలును ఇశ్రాయేలీయుల కోసం నియమించి వాళ్ళను కాపాడాడు.
10యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిషాతాయిమును జయించాడు.
11ఆ తరువాత నలభై సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత కనజు కొడుకు ఒత్నీయేలు చనిపోయాడు.
12ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. వాళ్ళు యెహోవా దృష్టికి దోషులైన కారణంగా యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు.
13అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని వెళ్లి ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూరచెట్ల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
14ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజుకు బానిసలుగా ఉన్నారు.
15ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు
16ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల కత్తిని చేయించుకుని, తన వస్త్రంలో తన కుడి తొడమీద
17దాన్ని కట్టుకుని, ఆ కప్పం మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి తెచ్చాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండే వాడు.
18ఏహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తరువాత కప్పం మోసిన మనుషులను పంపివేసి
19గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము దగ్గర నుంచి తిరిగి వచ్చి “రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి” అన్నాడు. అప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళే వరకూ మాట్లాడవద్దని చెప్పాడు.
20ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు.
21అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు.
22ఆ కత్తితో పాటు దాని పిడి కూడా అతని కడుపులోకి దిగి పోయింది. ఆ కత్తి అతని వెనుకనుంచి బయటకు వచ్చింది. అతని క్రొవ్వు ఆ కత్తిని కప్పేసిన కారణంగా ఏహూదు ఆ కత్తిని అతని శరీరంలోనుంచి బయటకు తీయలేదు.
23అప్పుడు ఏహూదు వసారాలోకి వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టాడు.
24అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ రాజు సేవకులు లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ మేడగది తలుపుల గడియలు వేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు, రాజు తన చల్లని గదిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనుకున్నారు.
25వాళ్ళు ఎంతసేపు కనిపెట్టినా రాజు ఆ గది తలుపులు తీయకపోవడంతో వాళ్ళు తాళపు చెవి తెచ్చి తలుపులు తీసి చూశారు. వాళ్ళ రాజు చనిపోయి నేలమీద పడి ఉన్నాడు.
26వాళ్ళు ఆలస్యం చేస్తుండగా ఏహూదు తప్పించుకుని చెక్కిన విగ్రహాలు ఉన్న పెసీలీమును దాటి శెయీరాకు పారిపోయాడు.
27అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూర ఊదగా ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతం నుంచి దిగి అతని దగ్గరికి వచ్చారు.
28అతడు వాళ్ళతో “నాతో రండి, యెహోవా మీ శత్రువులైన మోయాబీయులను ఓడించబోతున్నాడు” అన్నాడు. కాబట్టి వాళ్ళు అతని వెంట దిగివచ్చి మోయాబువారికి ఎదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించుకుని ఎవరినీ దాటనివ్వలేదు.
29ఆ సమయంలో వాళ్ళు మోయాబీయుల్లో బలం, సామర్ధ్యం కలిగిన పరాక్రమవంతులైన పదివేల మందిని చంపారు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఆ దినాన మోయాబీయులు ఇశ్రాయేలీయుల బలాన్ని బట్టి అణగారిపోయారు. ఆ కారణంగా ఆ ప్రాంతం ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
30అతని తరువాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. అతడు ఆరు వందల మంది ఫిలిష్తీయులను పశువులు కాసే మునుకోల కర్రతో చంపాడు.
31అతడు కూడా ఇశ్రాయేలీయులను ప్రమాదాల నుంచి కాపాడాడు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath