క్రైస్తవం
వెనక్కి

న్యాయాధిపతులు 19

1ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.

2అయితే ఆమె అతణ్ణి విడిచి పెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లేహెం లోని తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడే నాలుగు నెలలు ఉండిపోయింది.

3ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెని తిరిగి తెచ్చుకోడానికి ఆమె భర్త తన సేవకుణ్ణి, రెండు గాడిదలనూ తీసుకుని బయల్దేరాడు. ఆమె అతణ్ణి తన తండ్రి ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. ఆ యువతి తండ్రి అతణ్ణి చూసి అతణ్ణి కలుసుకున్నందుకు సంతోషపడ్డాడు.

4ఆ అమ్మాయి తండ్రి, అంటే అతని మామ తనతో మూడు రోజులుండమని అతణ్ణి బలవంతం చేశాడు. కాబట్టి అతడు మూడు రోజులూ, రాత్రులూ తింటూ తాగుతూ అక్కడే గడిపాడు.

5నాలుగవ రోజు వెళ్ళడానికి వాళ్ళు ఉదయాన్నే మేలుకున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు. కాని ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడితో “కొంచెం రొట్టె తిని బలం తెచ్చుకో. ఆ తరువాత వెళ్ళవచ్చు” అన్నాడు.

6దాంతో మళ్ళీ వారిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనమయ్యాక ఆ అమ్మాయి తండ్రి “దయచేసి ఈ రాత్రంతా మాతో గడుపు. సరదాగా, సంతోషంగా ఉండు” అన్నాడు.

7అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్ళీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు.

8అయిదో రోజు అతడు ఉదయాన్నే ప్రయాణానికి లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి “మధ్యాహ్నం వరకూ ఉండి భోజనం చేసి కొంచెం బలపడు” అంటూ నిలిపివేశాడు. సాయంత్రం అయ్యేవరకూ తాత్సారం చేస్తూ వారు భోజనం చేసారు.

9ఆ లేవీయుడూ, అతని ఉంపుడుకత్తే, అతని సేవకుడూ ప్రయాణానికి లేచారు. అతని మామ అతనితో “చూడు, సాయంత్రం అయింది. చీకటి పడబోతోంది. నువ్వు మరో రాత్రి ఇక్కడే ఉండి సరదాగా గడుపు. రేపు ఉదయాన్నే లేచి నీ ఇంటికి వెళ్ళవచ్చు.” అని బలవంతం చేశాడు.

10కానీ అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యెబూసు (అంటే యెరూషలేము) దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడుగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన రెండు గాడిదలూ ఉన్నాయి.

11వారు యెబూసును సమీపించినప్పుడు పూర్తిగా సాయంత్రం అయింది. అతని సేవకుడు అతనితో “మనం ఈ యెబూసీయుల ఊర్లోకి వెళ్దాం. దీనిలో ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.

12కానీ అతని యజమానుడు “ఇశ్రాయేలీయుల పట్టణాల్లోనే మనం బస చేద్దాం. ఇతరుల పట్టణాల్లో మనం ప్రవేశించం. మనం గిబియా వరకూ వెళ్దాం” అన్నాడు.

13తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో “నువ్వు రా, మనం రామాకు గానీ గిబియాకి గానీ వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం.” అన్నాడు.

14అలా వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారు. చివరకూ బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాకు వచ్చారు. అప్పటికి చీకటి పడింది.

15కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.

16అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు.

17ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగాడు.

18అందుకతడు “మేము యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతం లోని బేత్లెహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు

19మా గాడిదలకు గడ్డీ, దాణా ఉన్నాయి. నాకూ, మీ సేవకురాలైన ఈమెకూ, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికీ ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.” అన్నాడు.

20ఆ వృద్ధుడు “మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను

21అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు” అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.

22వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్దునితో మాట్లాడారు. “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకు రా. అతణ్ణి మేము తెల్సుకోవాలి” అన్నారు.

23ఆ వృద్ధుడు బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు “సోదరులారా, వద్దు. దయచేసి అలాంటి దుర్మార్గపు పని చేయకండి. ఈ వ్యక్తి నా ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ నీచమైన పని చేయకండి.

24చూడండి, నా కూతురు కన్య. ఆమే, ఆ వ్యక్తి ఉంపుడుగత్తే ఉన్నారు. వాళ్ళను నేను బయటకు తీసుకుని వస్తాను. వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్లు చెరుపుకోండి. కాని ఈ వ్యక్తి విషయంలో అలాంటి దుర్మార్గపు పని చేయకండి” అన్నాడు.

25కాని వాళ్ళు అతని మాట వినలేదు. దాంతో ఆ వ్యక్తి తన ఉంపుడుగత్తెను బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆమెను పట్టుకుని రాత్రంతా మానభంగం చేస్తూ, లైంగికంగా హింసిస్తూ ఉన్నారు. తెల్లవారుతుండగా ఆమెను విడిచి వెళ్ళారు.

26ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న ఆ వృద్దుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చేవరకూ అలానే ఉంది.

27ఉదయం ఆమె భర్త ప్రయాణమై వెళ్ళడానికి తలుపులు తీశాడు. అతని ఉంపుడుగత్తె ఆ ఇంటి గుమ్మం దగ్గర గడప మీద చేతులు చాపి పడి ఉంది.

28ఆ లేవీయుడు “లే వెళ్దాం” అన్నాడు. కానీ ఆమె జవాబివ్వలేదు. ఆమెను గాడిదపై వేసుకుని ఆ వ్యక్తి తన ఇంటికి ప్రయాణం సాగించాడు.

29అతడు తన యింటికి వచ్చాక ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం మొత్తం పన్నెండు ముక్కలుగా కోశాడు. ఆ పన్నెండు ముక్కలను ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతాలన్నిటికీ పంపాడు.

30దాన్ని చూసిన వారంతా “ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకూ ఇలాంటిది జరగడం మనం చూడలేదు, వినలేదు. దీని గురించి ఆలోచించండి! ఏం చేయాలో చెప్పండి” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath