క్రైస్తవం
వెనక్కి

యెషయా 5

1నా ప్రియుణ్ణి గురించి పాడతాను వినండి. అతని ద్రాక్షతోట విషయమై నాకు ఇష్టమైన వాణ్ణి గురించి గానం చేస్తాను. వినండి. సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది.

2ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది.

3కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పమని మీకు విన్నవించుకుంటున్నాను.

4నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరి ఇంకా ఏమి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాస్తుందని నేను ఎదురు చూస్తే అది పిచ్చి ద్రాక్షలు ఎందుకు కాసింది?

5ఆలోచించండి, నేను నా ద్రాక్షతోటకు చేయబోయే దాన్ని మీకు వివరిస్తాను. దాన్ని పశువులు మేసేలా దాని కంచెను కొట్టి వేస్తాను. అందరూ దాన్ని తొక్కేలా దాని గోడను పడగొట్టి పాడుచేస్తాను.

6ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను.

7ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది.

8స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకుంటూ పోతున్న మీకు బాధ.

9నేను చెవులారా వినేలా సేనల ప్రభువు యెహోవా స్పష్టంగా ఈ మాట నాకు చెప్పాడు. నిజంగా గొప్పవి, అందమైన చాలా ఇళ్ళు వాటిలో నివాసముండే వారు లేక పాడైపోతాయి.

10పది ఎకరాల ద్రాక్షతోట ఇరవై లీటర్ల రసం మాత్రం ఇస్తుంది. పది కిలోల గింజలు చల్లగా పండిన పంట ఒక కిలో అవుతుంది.

11మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ.

12వారు సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయి వాయిస్తూ ద్రాక్షారసం తాగుతూ విందు చేస్తారు గానీ యెహోవా పని గురించి ఆలోచించరు. ఆయన తన చేతితో చేసిన వాటిని లక్ష్యపెట్టరు.

13అందువల్ల నా ప్రజలు జ్ఞానం లేక చెరలోకి వెళ్లిపోతున్నారు. వారిలో ఘనులు పస్తులుంటున్నారు. సామాన్యులు దాహంతో అలమటిస్తున్నారు.

14అందుకనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని తన నోరు బార్లా తెరుస్తున్నది. వారిలో గొప్పవారు, సామాన్య ప్రజలు, నాయకులు, తమలో విందులు చేసుకుంటూ సంబరాలు చేసుకునే వారు పాతాళానికి దిగిపోతారు.

15సామాన్యుడు మట్టి కరుస్తాడు. గొప్పవాడు తగ్గిపోతాడు. ఘనత పొందిన వారు తమ కళ్ళు నేలకు దించుకుంటారు.

16సేనల ప్రభువు యెహోవాయే తన న్యాయాన్ని బట్టి ఘనత పొందుతాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధతను కనపరుస్తాడు.

17అప్పుడు ధనికుల స్థలాలు గొర్రెలకు మేత బీడుగా ఉంటాయి. వారి శిథిలాల్లో గొర్రెపిల్లలు మేస్తాయి.

18శూన్యత తాళ్ళతో అతిక్రమాన్ని లాక్కుంటూ ఉండే వారికి బాధ. మోకులతో పాపాన్ని లాగే వారికి బాధ.

19“దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ.

20కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ.

21తమ దృష్టికి తాము జ్ఞానులమనీ తమ అంచనాలో తాము బుద్ధిమంతులమనీ ఊహించుకునే వారికి బాధ.

22ద్రాక్షారసం తాగడంలో పేరు తెచ్చుకున్న వారికి, మద్యం కలపడంలో చాతుర్యం గల వారికి బాధ.

23వారు లంచం పుచ్చుకుని దుర్మార్గుణ్ణి వదిలేస్తారు. నిర్దోషి హక్కులు హరిస్తారు.

24అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు, ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది. ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు.

25దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది.

26ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు.

27వారిలో అలసిపోయిన వాడు గానీ తొట్రు పడేవాడు గానీ లేడు. వారిలో ఎవడూ నిద్రపోడు, కునికిపాట్లు పడడు. వారి నడికట్టు వదులు కాదు. వారి చెప్పుల వారు తెగిపోదు.

28వారి బాణాలు పదునైనవి. వారి విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి. వారి గుర్రాల డెక్కలు చెకుముకిరాళ్ల వంటివి. వారి రథచక్రాలు తుఫాను లాంటివి.

29సింహం గర్జించినట్టు వారు గర్జిస్తారు. సింహం కూనలాగా గర్జిస్తారు. వేటను నోట కరుచుకుని యధేచ్ఛగా ఈడ్చుకుపోతారు. విడిపించగల వారెవరూ ఉండరు.

30వారు ఆ దినాన సముద్ర ఘోష వలె తమ ఎరపై గర్జన చేస్తారు. ఒకడు దేశం కేసి చూస్తే అంధకారం, దురవస్థ కనిపిస్తాయి. మేఘాలు కమ్మి వెలుగంతా చీకటై పోతుంది.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath