క్రైస్తవం
వెనక్కి

యెషయా 44

1అయినా నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న ఇశ్రాయేలూ, విను.

2నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ , భయపడకు.

3నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.

4నీటి కాలవల దగ్గర నాటిన నిరవంజి చెట్లు గడ్డిలో పెరిగినట్టు వారు పెరుగుతారు.

5ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు. మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.”

6ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు.

7ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు? అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి.

8మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను.

9విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు.

10ఎందుకూ పనికిరాని విగ్రహాన్ని పోత పోసి దాన్ని ఒక దేవుడిగా నిరూపించేవాడెవడు?

11ఇదిగో, దాన్ని పూజించే వారంతా సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు మానవ మాత్రులే గదా? వారందరినీ పోగు చేసి నిలబెడితే వారు తప్పకుండా భయపడతారు, సిగ్గుపడతారు.

12కమ్మరి ఇనుప గొడ్డలిని పదును చేస్తూ నిప్పుల మీద పని చేస్తాడు. తన బలమైన చేతితో దాన్ని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. నీళ్లు తాగకపోవడం చేత సొమ్మసిల్లి పడిపోతాడు.

13వడ్లవాడు చెక్క మీద నూలు తాడు వేసి గీత గీస్తాడు. దాన్ని చిత్రిక పట్టి నునుపుగా చేస్తాడు. ఎండ్రకాయ గుర్తు పెట్టి దాన్ని తయారు చేస్తాడు. మందిరంలో నిలబెట్టడం కోసం ఒక మానవ రూపాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాడు.

14ఒకడు దేవదారు చెట్లను నరకడానికి పూనుకుంటాడు. లేక సరళ వృక్షాన్నో సింధూర వృక్షాన్నో ఏదొక అడవి వృక్షాన్ని ఎన్నుకుంటాడు. ఒకడు ఒక చెట్టును నాటినప్పుడు అది వర్షం సాయంతో పెరుగుతుంది.

15అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు. మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు.

16కొంత చెక్కను నిప్పుతో కాల్చి, దానిపై మాంసం వండుకుని తిని తృప్తి పొందుతాడు. ‘ఆహా, చలి కాచుకున్నాను, వెచ్చగా ఉంది’ అనుకున్నాడు.

17మిగిలిన భాగాన్ని తాను దేవుడుగా భావించే విగ్రహాన్ని చేసుకుంటాడు. దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ‘నా దేవుడివి నువ్వే, నన్ను రక్షించు’ అని ప్రార్థిస్తాడు.

18వారికి తెలియదు, అర్థం చేసుకోరు. వారు చూడకుండేలా వారి కళ్ళు, అర్థం చేసుకోకుండేలా వారి హృదయాలు మూసుకుపోయాయి.

19ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను. మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా? ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు.

20వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. ‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు.

21యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.

22మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.

23యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”

24గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.

25నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి. సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే.

26నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే. యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను. దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే.

27నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే.

28కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath