క్రైస్తవం
వెనక్కి

యెషయా 22

1“దర్శనం లోయ ” ను గూర్చిన దైవ ప్రకటన. “మీరంతా ఇళ్ళ పైకప్పుల పైకి ఎక్కి ఉండటానికి కారణమేంటి?

2సందడితో నిండి పోయి కేకలు వేస్తున్న పట్టణమా! వేడుకల్లో మునిగిపోయిన నగరమా! నీలో చనిపోయిన వాళ్ళు కత్తి వల్ల హతం కాలేదు. వాళ్ళు యుద్ధంలో చనిపోలేదు.

3నీ అధిపతులంతా కలసి పారిపోయారు. కానీ విలుకాళ్ళు బాణాలు వేసి కొట్టకుండానే వాళ్ళు దొరికి పోయారు. దూరంగా పారిపోయినా శత్రువు వాళ్ళందర్నీ కలిపి పట్టుకున్నాడు.

4కాబట్టి నేను చెప్పేదేమిటంటే ‘నా వంక చూడకండి. నేను తీవ్రమైన విషాదంతో ఏడుస్తాను. నా జనానికి సంభవించిన వినాశనం గూర్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి.’

5దర్శనం లోయలో అల్లరి, తొక్కిసలాటతో నిండిన ఒక రోజు రాబోతుంది. దాన్ని సేనల ప్రభువు అయిన యెహోవా రప్పించబోతున్నాడు. ఆ రోజు ఓటమీ, కలవరమూ కలుగుతాయి. గోడలు కూలిపోతాయి. ప్రజలంతా సహాయం కోసం పర్వతాల వైపు చూస్తారు.

6ఏలాము రథాలతో ఉన్న యోధులతో, రౌతులతో తన అంబుల పొదిని ధరించింది. కీరు తన డాలును బయటకు తీసింది.

7నీకు ఇష్టమైన లోయలన్నీ రథాలతో నిండిపోతాయి. తమ గుర్రాలపై కూర్చున్న రౌతులు పట్టణ ద్వారం దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.

8అప్పుడు ఆయన యూదా భద్రత కవచాన్ని తీసివేశాడు. ఆ రోజు నువ్వు ‘అడవి రాజ భవనం’ లో ఉన్న ఆయుధాల కోసం చూశావు.

9దావీదు పట్టణానికి అనేక చోట్ల బీటలు పడటం నువ్వు చూశావు. అది తెలుసుకుని నువ్వు దిగువన ఉన్న కోనేరు నుండి నీళ్ళ తెచ్చుకున్నావు.

10మీరు యెరూషలేములోని ఇళ్ళను లెక్కపెట్టారు. ప్రాకారాన్ని బలపరచడానికై మీరు ఇళ్ళు పడగొట్టారు.

11పాత కోనేటి నీళ్ళ కోసం రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని నిర్మించారు. కానీ పట్టణాన్ని నిర్మించిన వాణ్ణి మీరు పట్టించుకోలేదు. ఏనాడో దాని కోసం ఆలోచించిన వాణ్ణి మీరు లక్ష్యం చేయలేదు.

12ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు.

13కానీ చూడండి! దానికి బదులుగా, పశువులను చంపుదాం, గొర్రెలను వధించుదాం. వాటి మాంసం తిని ద్రాక్షారసం తాగుదాం. సంతోషంతో పండగ చేసుకుందాం. ఎందుకంటే రేపు చనిపోతాం కదా” అనుకున్నారు.

14ఈ సంగతి సేనల ప్రభువైన యెహోవా నా చెవుల్లో తెలియజేశాడు. “మీరు చేసిన ఈ దోషానికి క్షమాపణ లేదు. మీరు చనిపోయేటప్పుడైనా సరే” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.

15సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా చెప్పాడు. భవనంలో నిర్వహణా పనులు చూసే షెబ్నా దగ్గరకి వెళ్ళు. అతనికి ఇలా చెప్పు.

16“ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు? ఎత్తయిన స్థలంలో సమాధిని తొలిపించుకుంటున్నావు. రాతిలో నీ కోసం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు!

17చూడు, బలవంతుడివైన నిన్ను యెహోవా విసిరి వేయబోతున్నాడు. ఆయన నిన్ను నేలకు విసిరి కొట్టబోతున్నాడు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు.

18ఆయన నిన్ను కచ్చితంగా చుట్ట చుట్టివేస్తాడు. ఒక బంతిలా నిన్ను విశాలమైన దేశంలోకి విసిరివేస్తాడు. నువ్వు అక్కడే చనిపొతావు. నీ గొప్ప రథాలు కూడా అక్కడే పడి ఉంటాయి. నీ యజమాని ఇంటికి నువ్వు ఒక అవమానంగా ఉంటావు.

19నీ ఉద్యోగం నుండి నిన్ను తొలగిస్తాను. నీ హోదాను తీసి వేస్తాను. నిన్ను కిందకు లాగేస్తాను.

20ఆ రోజున నేను నా సేవకుడూ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీముని పిలుస్తాను.

21నీ చొక్కా అతనికి తొడిగిస్తాను. నీ నడికట్టును అతనికి కడతాను. నీ అధికారాన్ని అతనికి బదలాయిస్తాను. అతడు యెరూషలేములో నివాసం ఉన్న వాళ్ళకీ, యూదా జాతి వాళ్ళకీ ఒక తండ్రిగా ఉంటాడు.

22నేను దావీదు ఇంటి తాళపు చెవిని, అధికారాన్ని అతని భుజంపై ఉంచుతాను. అతడు తెరచినప్పుడు ఎవ్వరూ మూయలేరు. అతడు మూసినప్పుడు ఎవ్వరూ తెరవలేరు.

23బలమైన చోట ఒక మేకును దిగగొట్టినట్టు నేను అతణ్ణి స్థిరపరుస్తాను. అతడు తన తండ్రి కుటుంబానికి ఘనమైన సింహాసనంగా ఉంటాడు.

24చిన్న గిన్నెలనూ, పాత్రలనూ మేకుకి వేలాడదీసినట్టుగా అతని పితరుల ఇంటి గౌరవమూ, సంతానం, వారసుల గౌరవమూ అతనిపై వేలాడదీస్తారు.”

25ఇది సేనల ప్రభువైన యెహోవా మాట. “ఆ రోజున బలమైన చోట కొట్టిన మేకు సడలి ఊడిపోతుంది. కింద పడిపోతుంది. దానిపై ఆధారపడిన బరువంతా తెగి కింద పడుతుంది.” ఇది యెహోవా మాట.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath