యెషయా 13
1బబులోనును గూర్చి ఆమోజు కొడుకు యెషయా స్వీకరించిన ప్రకటన.
2చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి.
3నాకు ప్రతిష్ఠితులైన వాళ్లకు నేను ఆజ్ఞ ఇచ్చాను. నా కోపం అమలు చెయ్యమని నా శూరులను పిలిచాను. నా ప్రభావాన్నిబట్టి ఆనందించే వాళ్ళను పిలిపించాను.
4కొండల్లో ఒక పెద్ద జనసమూహం ఉన్నట్టు వినిపిస్తున్న ఆ శబ్దం వినండి. సమకూడుతున్న రాజ్యాల ప్రజలు చేసే అల్లరి శబ్దం వినండి. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా యుద్ధం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు.
5సర్వలోకాన్ని పాడు చెయ్యడానికి దూర దేశం నుంచీ, ఆకాశపు అంచుల నుంచీ యెహోవా, ఆయన తీర్పు అమలు చేసే సాధనాలు వస్తున్నారు.
6బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది.
7అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.
8ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి.
9యెహోవా దినం వస్తోంది. దేశాన్ని పాడు చెయ్యడానికీ, పాపులు దానిలో ఉండకుండా పూర్తిగా నాశనం చెయ్యడానికీ క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తోంది.
10ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.
11చెడుతనాన్ని బట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్ని బట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను.
12బంగారం కన్నా మనుషులనూ, ఓఫీరు దేశపు సువర్ణం కన్నా మానవజాతినీ అరుదుగా ఉండేలా చేస్తాను.
13సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కోపాగ్ని కురిసే రోజున, ఆయన ఉగ్రతకు ఆకాశం వణికేలా, భూమి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.
14అప్పుడు వేటకు గురైన జింకలాగా, పోగుచెయ్యని గొర్రెల్లాగా ప్రజలు తమ తమ స్వజాతి వైపు తిరుగుతారు. తమ స్వదేశాలకు పారిపోతారు.
15దొరికిన ప్రతివాడూ కత్తివాత కూలుతాడు. బందీగా దొరికిన ప్రతివాడూ ఖడ్గంతో చనిపోతాడు.
16వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ పసిపిల్లలను విసిరి కొట్టినప్పుడు ముక్కలౌతారు. వాళ్ళ ఇళ్ళు దోపిడీ అవుతాయి. వాళ్ళ భార్యలు అత్యాచారానికి గురౌతారు.
17చూడు, వాళ్ళ మీద దాడి చెయ్యడానికి నేను మాదీయులను రేపడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు వెండిని పట్టించుకోరు. బంగారం కూడా వాళ్ళకు ఆనందం కలిగించదు.
18వాళ్ళ బాణాలు యువకులను చీలుస్తాయి. దూసుకుపోతాయి. వాళ్ళు పిల్లలను విడిచిపెట్టరు, పసిపిల్లల మీద దయ చూపించరు.
19అప్పుడు రాజ్యాల్లో గొప్పదిగా, కల్దీయుల శోభకూ, అతిశయానికీ కారణమైన బబులోను, దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల్లాగా అవుతుంది.
20అది ఇంకెన్నడూ నివాసస్థలంగా ఉండదు. తరతరాల్లో ఇంక దానిలో ఎవడూ కాపురం ఉండడు. అరబీయుడు అక్కడ తన గుడారం వెయ్యడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.
21ఎడారి మృగాలు అక్కడ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నిండా గుడ్లగూబలు, నిప్పుకోళ్ళూ ఉంటాయి. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.
22వాళ్ళ కోటల్లో అడవి కుక్కలూ, వాళ్ళ అందమైన రాజమందిరాల్లో నక్కలూ అరుస్తాయి. దాని కాలం దగ్గరపడింది. దాని రోజులు ఇక ఆలస్యం కావు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath