ఆదికాండం 37
1యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు.
2యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు.
3యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు.
4అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.
5యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు.
6అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి.
7అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.”
8అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.
9అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు.
10అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో “నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?” అని అతణ్ణి గద్దించాడు.
11అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు.
12యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు.
13అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరికి పంపుతాను, రా” అన్నప్పుడు అతడు “అలాగే” అని చెప్పాడు.
14అప్పుడు యాకోబు “నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా” అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు.
15యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి “దేని గురించి వెదుకుతున్నావు?” అని అడిగాడు.
16అందుకతడు “నేను నా సోదరులను వెదుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.
17అందుకు ఆ మనిషి “వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు ‘దోతానుకు వెళ్దాం పదండి’ అని చెప్పుకోవడం నేను విన్నాను” అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు.
18అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు.
19వారు “అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు.
20వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, ‘ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది’ అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం” అని ఒకరి కొకరు చెప్పుకున్నారు.
21రూబేను ఆ మాట విని “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు.
22ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి “రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి” అని వారితో చెప్పాడు.
23యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి,
24అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట.
25వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు.
26అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం?
27ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు” అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు.
28ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు.
29రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు.
30అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి “చిన్నవాడు లేడే, అయ్యో, నేనెక్కడికి వెళతాను?” అన్నాడు.
31వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు.
32వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు.
33అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు.
34యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు.
35అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.
36మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath