ఆదికాండం 29
1యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు.
2అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది.
3అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు.
4యాకోబు వారిని చూసి “సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?” అని అడగ్గా వారు “మేము హారాను వాళ్ళం” అన్నారు.
5అతడు “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగితే వారు “అవును, మాకు తెలుసు” అన్నారు.
6“అతడు క్షేమంగా ఉన్నాడా?” అని అడిగినప్పుడు వారు “క్షేమంగానే ఉన్నాడు, అదిగో, అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తున్నది” అని చెప్పారు.
7అతడు “ఇదిగో, ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులను సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్ళు పెట్టి, పోయి వాటిని మేపండి” అని చెప్పినప్పుడు,
8వారు “మందలన్నిటినీ మళ్ళించే దాకా అది మా వల్ల కాదు. బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెడతాం” అన్నారు.
9అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకువచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది.
10యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు, అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని పెద్దగా ఏడ్చాడు.
11యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ,
12రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది.
13లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు.
14అప్పుడు లాబాను “నిజంగా నువ్వు నా ఎముకవీ నా మాంసానివీ” అన్నాడు. యాకోబు నెల రోజులు అతని దగ్గర నివసించిన తరువాత,
15లాబాను “నువ్వు నా బంధువ్వి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు” అని యాకోబును అడిగాడు.
16లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు.
17లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది.
18యాకోబు రాహేలును ప్రేమించి “నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
19అందుకు లాబాను “ఆమెని పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు” అని చెప్పాడు.
20యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.
21తరువాత యాకోబు “నా రోజులు పూర్తి అయ్యాయి కాబట్టి నేను నా భార్య దగ్గరికి పోతాను, ఆమెను నాకివ్వు” అని లాబానును అడిగాడు.
22లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగుచేసి విందు చేశాడు.
23రాత్రి వేళ తన పెద్ద కూతురు లేయాని అతని దగ్గరికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఆమెతో ఆ రాత్రి గడిపాడు.
24లాబాను తన దాసి అయిన జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు.
25తెల్లవారిన తరువాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకుని లాబానుతో “నువ్వు నాకు చేసిందేమిటి? రాహేలు కోసమే గదా నేను నీకు సేవ చేసింది? ఎందుకు నన్ను మోసపుచ్చావు?” అన్నాడు.
26అందుకు లాబాను “పెద్దదాని కంటే ముందుగా చిన్నదానికి పెళ్ళి చేయడం మా దేశమర్యాద కాదు.
27ముందు ఈమె ఏడు నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా ఏడు సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే, అందుకు ప్రతిఫలంగా రెండో ఆమెను కూడా నీకిస్తాం” అని చెప్పాడు.
28యాకోబు ఆ విధంగా లేయా వారం సంపూర్తి చేసిన తరువాత లాబాను తన కూతురు రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు.
29లాబాను తన దాసి అయిన బిల్హాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చాడు.
30యాకోబు రాహేలుతో రాత్రి గడిపాడు. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి లాబానుకు మరి ఏడు సంవత్సరాలు సేవ చేశాడు.
31అతడు లేయాను ప్రేమించక పోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది.
32లేయా గర్భవతి అయ్యి, కొడుకును కని “యెహోవా నా కష్టాన్నిచూశాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అనుకుని అతనికి “రూబేను” అని పేరు పెట్టింది.
33ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకును కని “నేను ప్రేమకు నోచుకోలేదనే సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడిని కూడా నాకు దయచేశాడు” అనుకుని అతనికి “షిమ్యోను” అని పేరు పెట్టింది.
34ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకుని కని “చివరికి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉంటాడు. ఎందుకంటే అతనికి ముగ్గురు కొడుకులను కన్నాను” అనుకుని అతనికి “లేవి” అని పేరు పెట్టింది.
35ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని “ఈసారి యెహోవాను స్తుతిస్తాను” అనుకుని అతనికి “యూదా” అని పేరు పెట్టింది. తరువాత ఆమె కానుపులు ఆగిపోయాయి.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath