యెహెజ్కేలు 47
1ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి.
2తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి.
3ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి.
4ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి.
5ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది.
6అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు.
7నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి.
8అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి.
9ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి.
10ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి.
11అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి.
12నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.”
13ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి.
14నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది.
15ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు.
16అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది.
17పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
18తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు.
19దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
20పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు.
21ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి.
22మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి.
23ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath