యెహెజ్కేలు 36
1నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు ఈ విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.
2యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “మీ గురించి శత్రువులు ఇలా చెప్పారు, ‘ఆహా! ప్రాచీన ఉన్నత స్థలాలు మా సొంతం అయ్యాయి.’
3అందుచేత ప్రవచించి ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకోవాలని చూస్తూ మిమ్మల్ని పాడుచేశారు. మీరు ఇతర రాజ్యాల వశమయ్యారు. మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి చులకన అయ్యారు.
4కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా ప్రభువు మాట వినండి. యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో పాడైన స్థలాలతో నిర్జనమైన పట్టణాలతో
5యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, చుట్టూ ఉన్న రాజ్యాలూ ఎదోం వారూ ద్వేష భావంతో ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నందుకు నేను తీవ్ర రోషంతో కచ్చితంగా చెప్పాను.
6కాబట్టి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచనం చెప్పు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో ఈ మాట చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇతర రాజ్యాలు మిమ్మల్ని అవమానించారు. కాబట్టి రోషంతో కోపంతో దీన్ని వెల్లడిస్తున్నాను.
7యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాలు అవమానానికి గురి అవుతారు అని నేను మాట ఇస్తున్నాను.
8ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలోనే ఇశ్రాయేలీయులైన నా ప్రజలు మీ దగ్గరికి వస్తారు. మీరు చిగురుపెట్టి వారి కోసం పళ్ళు కాస్తారు.
9నేను మీ కోసం ఉన్నాను. నేను మిమ్మల్ని దయతో చూస్తాను. మిమ్మల్ని దున్ని, మీ మీద విత్తనాలు నాటుతారు.
10మీ మీద ఎంతోమందిని, అంటే ఇశ్రాయేలీయులను విస్తరింప చేస్తాను. పట్టణాల్లో ప్రజలు నివసిస్తారు. శిథిలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది.
11మీ పర్వతాల మీద మనుషులూ పశువులూ విస్తారంగా ఉండేలా చేస్తాను. అవి వర్ధిల్లుతూ ఫలిస్తాయి. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి, మునుపటికంటే ఎక్కువ అభివృద్ది కలిగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
12నా ఇశ్రాయేలీయులు మీ మీద నడుస్తారు. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు. మీరు వారికి వారసత్వంగా ఉంటారు. వాళ్ళ పిల్లలను ఇక ఎంత మాత్రం మీరు చంపరు.
13ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘దేశమా, నువ్వు మనుషులను తినేస్తున్నావు. నీ రాజ్యాల్లోని పిల్లలు చచ్చిపోయారు’ అని ప్రజలు నీ గురించి చెప్పుకుంటున్నారు.
14కాబట్టి నువ్విక మనుషులను తినవు. వారి చావుకు నీ దేశం ఏడవదు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
15“నీ గురించి రాజ్యాలు ఇక ఎగతాళి చేయరు. వారి తిరస్కారం ఇక ఎన్నటికీ మీరు సహించనవసరం లేదు. మీ వలన ప్రజలు మరెన్నడూ పతనం కాబోరు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
16యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
17“నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించినప్పుడు వారి పద్ధతులతో పనులతో దాన్ని అపవిత్రపరచారు. వారి ప్రవర్తన, నా దృష్టిలో రుతుస్రావంలో ఉన్న స్త్రీ అపవిత్రతలాగా ఉంది.
18కాబట్టి దేశంలో వారు చేసిన హత్యలకూ వారి విగ్రహాలతో దేశాన్ని అపవిత్రపరచినందుకు నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించాను.
19వారి పద్ధతులను బట్టి వారి పనులను బట్టి వారిని శిక్షించి, నేను వేరే రాజ్యాల్లోకి వారిని వెళ్లగొట్టాను.
20వారు తాము వెళ్లిన ప్రదేశాల్లో ప్రతి చోటా వారి మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు నిజంగా యెహోవా ప్రజలేనా? ఆయన తన దేశంలో నుంచి ఆయన వాళ్ళను తోసేశాడు అని వారి గురించి చెప్పారు.
21అయితే ఇశ్రాయేలీయులు వెళ్ళిన ప్రాంతాల్లో నా పవిత్ర నామం దూషణకు గురి అవుతూ ఉంటే నా పేరు గురించి నేను చింతించాను.”
22కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను.
23మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవా ప్రభువునని వారు తెలుసుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
24“ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను.
25మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.
26కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను.
27నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను.
28నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
29మీ అపవిత్రనంతా పోగొట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీకు కరువు రానివ్వకుండా ధాన్యం సమృద్ధిగా పండేలా చేస్తాను.
30చెట్లు విస్తారంగా కాయలు కాసేలా, పొలాలు బాగా పంట పండేలా చేస్తాను. అప్పటినుంచి కరువు గురించిన నింద ఇతర రాజ్యాల్లో మీకు రాదు.
31అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ మీ చెడ్డ పనులనూ గుర్తుకు తెచ్చుకుని మీ అసహ్య కార్యాలు బట్టి, మీ సొంత పాపాల బట్టి, మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
32మీ కోసం నేను ఇలా చేయడం లేదని తెలుసుకోండి. ఇదే యెహోవా ప్రభువు సందేశం. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడండి.
33యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీ ప్రతి పాపం నుంచి మిమ్మల్ని శుద్ధి చేసే రోజు మీ పట్టణాల్లో మిమ్మల్ని నివసించేలా చేస్తాను. పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది.
34ఆ వైపుగా వెళ్ళే వారి దృష్టికి పాడుగా నిర్జనంగా కనిపించే భూమిని సేద్యం చేయడం జరుగుతుంది.
35పాడైన భూమి ఏదెను తోటలా అయింది. పాడుగా నిర్జనంగా ఉన్న ఈ పట్టణాలకు గోడలున్నాయి. అవి ప్రజలతో నిండి ఉన్నాయి, అనుకుంటారు.
36అప్పుడు నేను, యెహోవాను, పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టించి, నాశనమైన స్థలాల్లో చెట్లు నాటించాననీ మీ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు. నేను యెహోవాను. నేనే ఈ విషయాన్ని వెల్లడించాను. నేను దాన్ని నెరవేరుస్తాను.”
37యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలీయులు నన్ను అడిగేలా చేస్తాను. గొర్రెల మందల్లాగా నేను వారిని విస్తరింపజేస్తాను.
38నేను యెహోవానని వారు తెలుసుకునేలా అర్పణగా ఉన్న గొర్రెలంత విస్తారంగా, నియామక దినాల్లో యెరూషలేముకు వచ్చే గొర్రెలంత విస్తారంగా వారి పట్టణాల్లో మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించేలా నేను చేస్తాను.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath