క్రైస్తవం
వెనక్కి

యెహెజ్కేలు 31

1బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

2“నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోతో, అతని చుట్టూ ఉన్న సేవకులతో ఇలా చెప్పు. ఘనత విషయంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు?

3అష్షూరు లెబానోను దేవదారు వృక్షం లాంటిది. అందమైన కొమ్మలతో, విశాలమైన గుబురుతో, ఎంతో ఎత్తుగా ఉంది. దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కంటే ఎత్తుగా ఉంది.

4నీళ్లు సమృద్ధిగా ఉండడం వలన అది ఎత్తుగా ఎదిగింది. లోతైన నదిని బట్టి మహావృక్షం అయింది. దాని చుట్టూ కాలువలు పారుతున్నాయి. వాటి పిల్ల కాలువలు ఆ ప్రాంతంలోని చెట్లన్నిటికీ నీళ్ళు అందించాయి.

5ఆ ప్రాంతంలోని చెట్లన్నిటి కంటే అది ఎంతో ఎత్తుగా ఎదిగింది. దానికి చాలా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి. నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.

6పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి. దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి.

7నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది.

8దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు. సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు. దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు!

9అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను. అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.”

10అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “అది ఎంతో ఎత్తుగా ఉంది కాబట్టి, దాని కొన మిగతా వృక్షాలన్నిటిలో కంటే ఎత్తుగా ఉంది కాబట్టి, గర్వించింది.

11కాబట్టి నేను అతణ్ణి ఒడిసి పట్టుకుని రాజుల్లో అతి బలిష్ఠమైన వాడి చేతుల్లో పెట్టాను. ఈ అధికారి అతని చెడుతనానికి తగిన విధంగా అతని పట్ల జరిగించి తరిమివేశాడు.

12రాజ్యాలన్నిటిలో అతి క్రూరమైన విదేశీయులు అతన్ని నరికి పారవేశారు. అతని కొమ్మలు కొండల మీద, లోయల్లో పడ్డాయి. అతని శాఖలు భూమి మీదున్న అన్ని వాగుల్లో విరిగి పడ్డాయి. అప్పుడు భూరాజ్యాలన్నీ దాని నీడనుంచి వెళ్లి అతణ్ణి వదిలేశాయి.

13అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ వాలాయి. అతని కొమ్మల్లో భూజంతువులన్నీ ఉన్నాయి.

14నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అతిశయంతో అంత ఎత్తుకు ఎదగకుండా ఇది జరిగింది. దాని కొనలు మిగతా వృక్షాలకంటే ఎత్తుగా ఉండకుండాా, నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అంత ఎత్తుకు ఎదగకుండా ఉంటుంది. సాధారణ మనుషులు చనిపోయినట్టుగా అవన్నీ చస్తాయి.”

15యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి.

16అతని పతనం వల్ల కలిగే చప్పుడు విని ప్రజలు వణికిపోయేలా చేశాను. చచ్చిన వాళ్ళుండే గుంటలో అతన్ని విసిరేశాను. పల్లం ప్రాంతాల్లో ఉన్న ఏదెను చెట్లన్నిటినీ నేను ఓదార్చాను. ఇవన్నీ లెబానోనులో నీళ్ళ సమృద్ధి దొరికిన మంచి వృక్షాలు.

17వాళ్ళు కూడా కత్తితో చచ్చిన వారి దగ్గరికి అతనితో కూడా పాతాళానికి దిగిపోయారు. వీరంతా అతని నీడలో నివసించిన వాళ్ళు, అతనికి సహాయం చేసిన వాళ్ళు.

18ఘనత, ఆధిక్యం విషయంలో నీకు ఏదెను తోటలోని వృక్షాల్లో సాటి ఏది? అయినా నువ్వు ఏదెను వృక్షాలతో పాటు భూమి కిందికి, సున్నతిలేని వారి దగ్గరికి దిగిపోవలసి వస్తుంది. కత్తితో చచ్చిన వారితో నువ్వు నివసిస్తావు! ఫరో, అతని సేవకులందరికీ జరిగేది ఇదే” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath