యెహెజ్కేలు 24
1బబులోను చెరలో ఉన్న కాలంలో, తొమ్మిదో సంవత్సరం, పదో నెల, పదో రోజు యెహోవా వాక్కు నాకు మళ్ళీ ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
2“నరపుత్రుడా, ఈ రోజు పేరు రాసి ఉంచుకో. కచ్చితంగా ఈ రోజే బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాడు.
3తిరుగుబాటుచేసే ఈ ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.
4తొడ, జబ్బ మొదలైన మంచి ముక్కలన్నీ అందులో వేసి, మంచి ఎముకలు ఏరి దాన్ని నింపు.
5మందలో శ్రేష్ఠమైన వాటిని తీసికో. దానిలో ఉన్న ఎముకలు ఉడికేలా ఎక్కువ కట్టెలు పోగు చెయ్యి, దాన్ని బాగా పొంగించు. ఎముకలు ఉడికేలా పొంగించు.
6కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, రక్త నగరానికి బాధ. మడ్డి గల ఆ కుండకు బాధ తప్పదు. దానిలోనుంచి ఆ మడ్డి పోదు. దానికోసం చీటీలు వెయ్యకుండా వండిన దాన్ని ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసుకో.
7దాని రక్తం దాని మధ్యనే ఉంది. అది దాన్ని నున్నటి బండ మీద ఉంచింది. మట్టితో దాన్ని కప్పేందుకు వీలుగా ఆ రక్తాన్ని నేల మీద కుమ్మరించ లేదు.
8కాబట్టి దాని విషయం కోపాగ్ని రేకెత్తించి ప్రతీకారం తీర్చుకోవాలని, అది చిందించిన రక్తం మట్టితో కప్పకుండా దాన్ని ఆ నున్నటి బండ మీద నేను ఉండనిచ్చాను.”
9కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆ నెత్తురు నగరానికి బాధ. నేను కూడా మరి ఎక్కువ కట్టెలు పేర్చబోతున్నాను.
10కట్టెలు ఎక్కువ చెయ్యి! అగ్ని రాజెయ్యి! మాంసాన్ని బాగా ఉడకబెట్టు. మాంసం బాగా ఉడికించి మసాలా కలిపి పులుసు పెట్టు! ఎముకలు బాగా మగ్గనివ్వు!
11తరువాత ఖాళీ గిన్నె పొయ్యి మీద పెట్టు. అప్పుడు దానికున్న అశుద్ధం, మడ్డీ కరిగిపోతాయి. అది వేడై ఆ కంచును కాల్చే వరకూ ఆ గిన్నె పొయ్యి మీదే ఉంచు.
12అలసట పుట్టే వరకూ ఇంతగా శ్రమించినా, అగ్నిలో కాల్చినా, దానిలో నుంచి ఆ తుప్పు పోలేదు.
13నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.
14యెహోవానైన నేను ప్రకటించాను. అది జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనుకాడను, కనికరించను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలనుబట్టి నీకు శిక్ష ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు.”
15యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
16“నరపుత్రుడా, చూడు! నీ కళ్ళకు ఇష్టమైన దాన్ని నీ నుంచి ఒక్క తెగులు మూలంగా తీసేస్తాను. నువ్వు సంతాప పడవద్దు. కన్నీరు కార్చ వద్దు.
17నువ్వు మౌనంగా మూలగాలి. చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చెయ్యొద్దు. తలపాగా కట్టుకుని చెప్పులు వేసుకో. నీ గడ్డం దాచుకోవద్దు, భార్యను కోల్పోయిన పురుషుని ఆహారం తినొద్దు.”
18ఉదయం ప్రజలకు నేను ప్రకటించాను. సాయంత్రం నా భార్య చనిపోగా నాకు ఆజ్ఞాపించినట్టు మరుసటి ఉదయాన నేను చేశాను.
19ప్రజలు నన్ను “నువ్వు చేస్తున్నవాటి అర్థం మాకు చెప్పవా?” అని అడిగారు.
20కాబట్టి నేను వాళ్ళతో “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
21ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.
22అప్పుడు నేను చేసినట్టే మీరూ చేస్తారు. మీ గడ్డాలు కప్పుకోరు. సంతాపంలో ఉన్న పురుషుల ఆహారం తినరు!
23మీ తలపాగాలు మీ తలలపై ఉంటాయి. మీ చెప్పులు మీ కాళ్ళకు ఉంటాయి. మీరు సంతాపపడరు, కన్నీరు కార్చరు. ఒకడినొకరు చూసి మూలుగుతూ, మీరు చేసిన దోషాల కారణంగా క్షీణించిపోతారు.
24కాబట్టి, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిన ప్రకారం మీరూ చేస్తారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
25“కాని, నరపుత్రుడా, వాళ్ళ ఆనందాన్నీ, వాళ్ళ అతిశయాన్నీ, వాళ్ళ కళ్ళకు ఇష్టమైనదాన్నీ, వాళ్ళ కొడుకులనూ, వాళ్ళ కూతుళ్ళనూ నేను బలవంతంగా పట్టుకున్న రోజు నీకు సమాచారం తెలియజేయడానికి, తప్పించుకుని వచ్చిన వాడొకడు నీదగ్గరికి వస్తాడు.
26ఆ రోజున నువ్వింక మౌనంగా ఉండకుండాా, తప్పించుకుని వచ్చిన వాడితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు,
27నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు తెలుసుకునేలా నువ్వు వాళ్లకు సూచనగా ఉంటావు.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath