నిర్గమకాండం 9
1అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’
2నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే,
3యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది.
4అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు.
5దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు” అని చెప్పాడు.
6తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు.
7ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు.
8అప్పుడు యెహోవా “మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి.
9అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది” అని మోషే అహరోనులతో చెప్పాడు.
10మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి.
11ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి.
12అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు.
13తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
14భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను.
15ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజలనూ విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి.
16నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి.
17నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు.
18ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.
19అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.”
20యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు.
21యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు.
22యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు.
23మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు.
24ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు.
25ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి.
26అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.
27ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం.
28ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను” అని వాళ్ళతో చెప్పాడు.
29మోషే అతనితో “నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు.
30అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు” అన్నాడు.
31ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి.
32గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు.
33మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.
34అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
35యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath