క్రైస్తవం
వెనక్కి

నిర్గమకాండం 39

1యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పవిత్ర స్థలం లో నిలిచి చేసే సేవ కోసం నీలం ఊదా ఎర్రని రంగుల సేవా వస్త్రాలు అంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు.

2అతడు బంగారంతో, నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో ఏఫోదు చేశాడు.

3ఏఫోదు కోసం నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో, సన్నని నారతో నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగెలుగా కత్తిరించారు.

4ఏఫోదుకు రెండు భుజ ఖండాలు చేసి రెండు అంచులలో నిలబెట్టారు.

5దానికి బంగారంతో నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో పేనిన అందమైన అల్లిక ఏకాండంగా రెండు వైపులా కుట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.

6బంగారు అంచులలో పొదిగిన లేత పచ్చలు సిద్ధం చేశారు. ఇశ్రాయేలు కొడుకుల పేర్లు శాశ్వతంగా ఉండేలా ముద్రల రూపంలో చెక్కారు.

7అవి ఇశ్రాయేలు ప్రజల జ్ఞాపకార్ధంగా ఉండేలా ఆ ముద్రలను ఏఫోదు భుజాల మీద ఉంచారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.

8అతడు బంగారంతోనూ నీలం ఊదా ఎర్ర దారాలతోను పేనిన సన్న నారతో ఏఫోదును చేసినట్టు నైపుణ్యంగా ఒక వక్షపతకం తయారుచేశాడు.

9దాని పొడవు ఒక జాన, వెడల్పు ఒక జాన. ఆ పతకాన్ని మడత పెట్టినప్పుడు అది చదరంగా ఉంది.

10వారు దానిలో నాలుగు వరుసలుగా రత్నాలు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్న రత్నాలు,

11రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంత మణులు ఉన్న రత్నాలు,

12మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి, ఇంద్రనీలాల రత్నాలు,

13నాలుగవ వరుసలో ఎర్ర రంగు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతాలు ఉన్న రత్నాలు క్రమ పద్ధతిలో పొదిగించారు.

14ఇశ్రాయేలు కొడుకులు పన్నెండు మంది పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ఆ రత్నాలపై ముద్రపై చెక్కిన విధంగా పన్నెండు గోత్రాల పేర్లు ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పేరు చెక్కారు.

15వక్షపతకం కోసం దారాలు అల్లినట్టు స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు అల్లారు.

16వారు రెండు బంగారు అంచులు, రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు.

17అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను వక్షపతకం అంచులలో ఉన్న రెండు గుండ్రని కొంకీలలో వేశారు.

18అల్లిన ఆ రెండు గొలుసుల అంచులు ఆ రెండు అంచులకు తగిలించి ఏఫోదు భుజఖండాలపై దాని ఎదురుగా ఉంచారు.

19బంగారంతో రెండు గుండ్రని కొంకీలు చేసి ఏఫోదు ఎదురుగా ఉన్న వక్షపతకం లోపలి అంచు రెండు కొనలకు తగిలించారు.

20బంగారంతో మరో రెండు గుండ్రని కొంకీలు ఏఫోదు అల్లిక పైగా దాని రెండవ కూర్పు దగ్గర దాని ఎదురుగా, ఏఫోదు రెండు భుజఖండాలకు కింది భాగంలో వేశారు.

21వక్షపతకం ఏఫోదు అల్లిక కట్టు మీద ఉండేలా, ఏఫోదు నుండి విడిపోకుండా ఉండేలా ఆ పతకాన్ని దాని గుండ్రని కొంకీలకూ ఏఫోదు కొంకీలకూ నీలం రంగు దారంతో కట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.

22అతడు ఏఫోదు అంగీ కేవలం నీలం రంగు దారంతో అల్లిక పనిగా చేశాడు. ఆ అంగీ మధ్య ఉన్న రంధ్రాన్ని మూసి ఉంచే కవచం ఏర్పాటు చేశారు.

23ఆ రంధ్రం చిరిగి పోకుండా ఉండేందుకు రంధ్రం చుట్టూ కవచం ఉంచారు.

24అంగీ అంచుల మీద నీలం ఊదా ఎర్రని రంగుల గల నూలుతో పేని దానిమ్మ పండ్ల ఆకారాలు చేశారు.

25స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి ఆ దానిమ్మపండ్ల ఆకారాల మధ్యలో, అంటే అంగీ అంచుల మీద చుట్టూ ఉన్న దానిమ్మ పండ్లవంటి వాటి మధ్యలో ఆ గంటలను పెట్టారు.

26యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సేవ జరిగించడానికి ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండు వంటి ఆకారాన్ని అంగీ అంచుల మీద చుట్టూ తగిలించారు.

27యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అహరోనుకు, అతని కొడుకులకు సన్నని నారతో అల్లిక పని చేసి అంగీలు నేశారు. సన్నని నారతో తలపాగాలను చేసారు.

28సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.

29నీలం, ఊదా, ఎర్ర రంగులతో పేనిన సన్నని నారతో నడికట్టును అల్లిక పనిగా చేశారు.

30స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు.

31ఆ ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

32ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.

33దైవ నివాసాన్ని, దానిలో సామగ్రి మొత్తాన్నీ అంటే, దాని కొక్కేలు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,

34ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పు, గండుచేప తోళ్ల పైకప్పు, పైకప్పు తెర,

35శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం,

36సన్నిధి బల్ల, దాని సామగ్రి, సన్నిధి రొట్టెలు,

37పవిత్ర దీపవృక్షం, దాని దీపాలు, దీపాల వరుస, వాటి సామాను, దీపాలు వెలిగించేందుకు నూనె,

38బంగారం వేదిక, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యం, వేదిక ద్వారానికి తెర,

39ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి మొత్తం, గంగాళం, దాని పీట,

40ప్రహరీ తెరలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు, ప్రహరీ ద్వారానికి తెర, దాని తాళ్ళు, మేకులు, సన్నిధి గుడారం మందిర సేవ కోసం కావలసిన సామగ్రి అంతా,

41పవిత్ర స్థలం లో సేవ చేసే యాజకుడైన అహరోనుకూ, అతని కొడుకులకూ యాజక పరిచర్య పవిత్ర వస్త్రాలు సిద్ధం చేసి వాటన్నిటినీ మోషే దగ్గరికి తీసుకు వచ్చారు.

42యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తిచేశారు.

43వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్ళను దీవించాడు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath