నిర్గమకాండం 13
1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
2“ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”
3అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.
4అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు.
5కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.
6మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి.
7ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు.
8ఆ రోజు మీ పిల్లలకు ‘నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను’ అని చెప్పాలి.
9యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది.
10అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి.
11యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత
12మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.
13ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి.
14ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.
15ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను’ అని చెప్పాలి.
16యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.”
17ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. “ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో” అనుకున్నాడు.
18అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.
19మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు “దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి” అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు.
20వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు.
21పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.
22దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath