ప్రసంగి 2
1“అప్పుడు, నిన్ను సంతోషం చేత పరీక్షిస్తాను, నువ్వు మేలును రుచి చూడు” అని నేను నా హృదయంతో చెప్పుకున్నాను. అయితే అది కూడా వ్యర్థప్రయత్నమే అయ్యింది.
2నవ్వుతో, నువ్వు వెర్రిదానివి అనీ సంతోషంతో, నీవలన లాభం లేదు అనీ అన్నాను.
3నా మనస్సు ఇంకా జ్ఞానాన్ని కోరుకుంటుండగా ఆకాశం కింద మానవులు తమ జీవితంలో ఏమి చేస్తే మేలు పొందుతారో చూద్దామని, ద్రాక్షారసంతో నా శరీరాన్ని సంతోషపరచుకొంటాను, బుద్ధిహీనత వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించాను.
4నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను.
5తోటలు, ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్లు నాటించాను.
6ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను.
7ఆడ, మగ పనివారిని నియమించుకున్నాను. దాసులుగానే నా ఇంట్లో పుట్టినవారు నాకు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశువులు, గొర్రె మేకల మందలు నేను సంపాదించుకున్నాను.
8నా కోసం వెండి బంగారాలను, వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులనూ గాయకురాళ్ళనీ, మనుషులు కోరేవాటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలనూ ఉంచుకున్నాను.
9నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గొప్పవాణ్ణి, ఆస్తిపరుణ్ణి అయ్యాను. నా జ్ఞానం నన్ను నడిపిస్తూనే ఉంది.
10నా కళ్ళు చూడాలని ఆశపడిన వాటిని చూడకుండా నేను అడ్డు చెప్పలేదు. నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషించింది. అందుకే సంతోషాలను అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం.
11అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది. సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది.
12తరువాత రాబోయే రాజు, ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు? అనుకుని, నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, బుద్ధిహీనతను గురించి ఆలోచించడం ప్రారంభించాను.
13అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను.
14జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను.
15కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే.
16బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు. బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.
17ఇదంతా చూస్తే సూర్యుని కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధ పడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది.
18సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరవాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను.
19వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే.
20కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.
21ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది.
22సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది?
23అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.
24అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను.
25ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం?
26ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath