క్రైస్తవం
వెనక్కి

ద్వితీయోపదేశ కాండము 29

1యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే.

2మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు. “యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతటికీ చేసినదంతా,

3అంటే తీవ్రమైన ఆ బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు.

4అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు.

5నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకొనేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు. మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు.

6మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గానీ, మద్యం గానీ తాగలేదు.

7మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు

8మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము.

9కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించండి.

10మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ,

11అంటే మీ నాయకులూ, గోత్రాల ప్రజలూ, పెద్దలూ, అధికారులూ, పిల్లలూ, మీ భార్యలూ మీ శిబిరంలో ఉన్న పరదేశులూ, కట్టెలు నరికేవాడు మొదలుకుని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు.

12మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా

13ఈ రోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు.

14నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్ళతో

15ఇక్కడ ఈ రోజు మనతో కూడ కలవని వారితో కూడా చేస్తున్నాను.

16మనం ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్యనుంచి మనమెలా దాటివచ్చామో మీకు తెలుసు.

17వారి నీచమైన పనులూ, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు.

18ఆ దేశాల ప్రజల దేవుళ్ళను పూజించడానికి మన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తొలగే హృదయం, మీలో ఏ పురుషునికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు.

19అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ ‘నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది’ అనుకుంటాడు.

20యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచి వేస్తాడు.

21ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించడానికి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి వెళ్ళ గొట్టేస్తాడు.

22కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు.

23యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి,

24వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు.

25అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. ‘వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు.

26తమకు తెలియని అన్య దేవుళ్ళను, మొక్కవద్దని యెహోవా వారికి చెప్పిన దేవుళ్ళకు మొక్కి, పూజించారు.

27కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించడానికి దాని మీద యెహోవా కోపాగ్ని రగులుకుంది.

28యెహోవా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్ళను తమ దేశం నుంచి పెళ్ళగించి, వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.’

29రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath