ద్వితీయోపదేశ కాండము 20
1“మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
2మీరు యుద్ధానికి సిద్దమైనప్పుడు యాజకుడు ప్రజల దగ్గరకి వచ్చి వారితో ఇలా చెప్పాలి.
3‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.
4అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే.’
5సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. ‘మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
6ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
7ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.’
8సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.’
9సేనాధిపతులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తరువాత ప్రజలను నడిపించడానికి నాయకులను నియమించాలి.
10యుద్ధం చేయడానికి ఏదైనా ఒక పట్టణం సమీపించేటప్పుడు శాంతి కోసం రాయబారం పంపాలి.
11వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు.
12మీ శాంతి రాయబారాన్ని అంగీకరించకుండా యుద్ధానికి తలపడితే దాన్ని ఆక్రమించండి.
13మీ యెహోవా దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించేటప్పుడు అందులోని పురుషులందరినీ కత్తితో హతమార్చాలి.
14స్త్రీలనూ పిల్లలనూ పశువులనూ ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్నీ కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు.
15ఈ ప్రజల పట్టణాలు కాకుండా మీకు చాలా దూరంగా ఉన్న పట్టణాలన్నిటి విషయంలో ఇలాగే చేయాలి.
16అయితే మీ యెహోవా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాల్లో ఊపిరి పీల్చే దేనినీ బతకనివ్వకూడదు.
17మీ యెహోవా దేవుడు మీ కాజ్ఞాపించినట్టుగా హీత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.
18వారు తమ దేవుళ్ళకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.
19మీరు ఒక పట్టాణాన్ని ఆక్రమించుకోవడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికి వేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా!
20తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికి వెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath