క్రైస్తవం
వెనక్కి

ద్వితీయోపదేశ కాండము 19

1“మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.

2మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి.

3మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.

4హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా

5పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.

6చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు.

7అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

8యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి.

9ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి.

10ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.

11ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి

12ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి.

13అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.

14మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.

15ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.

16ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే

17ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.

18ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి.

19ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.

20ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు.

21దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath