క్రైస్తవం
వెనక్కి

ద్వితీయోపదేశ కాండము 18

1“యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.

2వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం.

3ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి.

4ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి.

5యెహోవా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు.

6ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే

7అక్కడ యెహోవా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవా దేవుని పేరున సేవ చేయవచ్చు.

8తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి.

9మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు.

10తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,

11ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు.

12వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.

13మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి.

14మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.

15మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి.

16హోరేబులో సమావేశమైన రోజున మీరు ‘మా యెహోవా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం’ అన్నారు.

17అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. ‘వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది.

18వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు.

19అతడు నా పేరుతో చెప్పే నా మాటలను విననివాణ్ణి నేను శిక్షిస్తాను.

20అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.’

21‘ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం?’ అని మీరనుకుంటే,

22ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath