ద్వితీయోపదేశ కాండము 12
1“మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.
2మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.
3వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.
4వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.
5మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి.
6మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.
7అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.
8ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు.
9నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.
10మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను.
11నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.
12మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
13మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు.
14కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.
15అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.
16వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి.
17మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
18వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి.
19మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు.
20మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు.
21నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,
22యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.
23అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు.
24మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి.
25మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.
26మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి.
27మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.
28నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.
29మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు.
30ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
31వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.
32నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath