దానియేలు 3
1రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహం చేయించాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు. బబులోను దేశాలోని “దూరా” అనే మైదానంలో దాన్ని నిలబెట్టించాడు.
2తరువాత నెబుకద్నెజరు తాను నిలబెట్టించిన విగ్రహ ప్రతిష్ఠకు దేశాల్లోని అధికారులను, ప్రముఖులను, సైన్యాధిపతులను, సంస్థానాల అధిపతులను, మంత్రులను, ఖజానా అధికారులను, ధర్మశాస్త్ర పండితులను, న్యాయాధిపతులను, సంస్థానాల్లో నాయకత్వం వహించేవాళ్ళను, ప్రజలందరినీ పిలవడానికి చాటింపు వేయించాడు.
3ఆ అధికారులు, ప్రముఖులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, మంత్రులు, ఖజానా అధికారులు, ధర్మశాస్త్ర పండితులు, న్యాయాధిపతులు, సంస్థానాల్లో నాయకత్వం వహించేవాళ్ళు, ప్రజలందరూ రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడివచ్చి, విగ్రహం ఎదుట నిలబడ్డారు.
4ఆ సమయంలో రాజ ప్రతినిధి ఒకడు ఇలా ప్రకటించాడు. “సమస్త ప్రజలారా, దేశస్థులారా, వివిధ భాషలు మాట్లాడేవారలారా, మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే,
5బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు మీరంతా రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారపు విగ్రహం ఎదుట సాష్టాంగపడి నమస్కరించాలి.
6అలా సాష్టాంగపడి నమస్కరించని వారిని వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారు.”
7బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు వినబడ్డాయి. ప్రజలంతా, దేశవాసులు, వివిధ భాషలు మాట్లాడేవాళ్లు సాష్టాంగపడి రాజు నిలబెట్టించిన విగ్రహానికి నమస్కరించారు.
8అప్పుడు జ్యోతిష్యుల్లో ముఖ్యులు కొందరు వచ్చి యూదులపై నిందలు మోపారు.
9నెబుకద్నెజరు రాజు దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “రాజు కలకాలం జీవించు గాక.
10రాజా, తమరు ఒక కట్టుబాటు నియమించారు. అది ఏమిటంటే, బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు విన్న ప్రతి వ్యక్తీ ఆ బంగారు విగ్రహం ఎదుట సాష్టాంగపడి దానికి నమస్కరించాలి.
11ఎవరైతే సాష్టాంగపడి నమస్కరించలేదో వాణ్ణి మండుతూ ఉండే అగ్నిగుండంలో వేస్తారు.
12రాజా, తమరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు యూదు యువకులను బబులోను దేశంలోని రాజ్య పరిపాలన వ్యవహారాలు నిర్వర్తించడానికి నియమించారు. ఆ ముగ్గురు వ్యక్తులు మీరు ఇచ్చిన ఆజ్ఞను గౌరవించక నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు మీ దేవుళ్ళను పూజించడం లేదు, తమరు నిలబెట్టించిన బంగారు విగ్రహం ఎదుట నమస్కరించడం లేదు.”
13రాజైన నెబుకద్నెజరు తీవ్ర కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తన దగ్గరికి తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకువచ్చారు.
14అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళతో “షద్రకూ, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనీ, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహానికి నమస్కరించడం లేదనీ నాకు తెలిసింది. ఇది నిజమేనా?
15బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు నేను చేయించిన విగ్రహానికి సాష్టాంగపడి దానికి నమస్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గనక నమస్కరించని పక్షంలో తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు” అన్నాడు.
16షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పారు. “నెబుకద్నెజరూ, దీని విషయం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
17మేము పూజిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు విధించే శిక్ష నుండి ఆయన మమ్మల్ని కాపాడతాడు.
18రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ దేవుళ్ళను మాత్రం మేము పూజించం అనీ, నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అనీ తెలుసుకో.”
19వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు.
20తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు.
21వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నెగోల నిలువుటంగీలు, పైదుస్తులు, మిగిలిన దుస్తులు ఏమీ తియ్యకుండానే బంధించి మండుతున్న ఆ గుండం మధ్యలో పడేలా విసిరివేశారు.
22రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన ఆ బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు.
23షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు.
24తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు.
25అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు.
26తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు.
27రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు.
28నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు.
29కనుక ఇప్పుడు నేనిచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఏ ప్రజల్లో గానీ, ఏ ప్రాంతంలో గానీ, ఏ భాష మాట్లాడేవాళ్ళలో గానీ ఎవరైనా షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళ దేవుణ్ణి అవమానపరిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. వాళ్ళ గృహాలను సమూల నాశనం చేయిస్తాను. వాళ్ళ దేవుడు రక్షించినట్టు మరి ఏ దేవుడూ రక్షించలేడు.”
30అప్పటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సంస్థానంలో ఉన్నత స్థానాల్లో అధికారులుగా నియమించాడు.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath