క్రైస్తవం
వెనక్కి

అపోస్తలుల కార్యములు 11

1యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.

2పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,

3“నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.

4అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ,

5“నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.

6దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.

7అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.

8అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను.

9రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది.

10ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.

11వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు.

12అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.

13అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.

14నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.

15నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు.

16అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.

17“కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు.

18వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.

19స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు.

20వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు.

21ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.

22వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.

23అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.

24అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.

25బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు.

26వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.

27ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.

28వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.

29అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు.

30వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath