క్రైస్తవం
వెనక్కి

2 రాజులు 8

1తరువాత ఎలీషా తాను బతికించిన పిల్లవాడి తల్లిని పిలిచాడు. ఆమెతో “నీ కుటుంబాన్ని తీసుకుని బయల్దేరు. ఎక్కడైనా నీకు అనుకూలమైన మరో దేశంలో ఉండు. ఎందుకంటే దేశంలో యెహోవా కరువు రప్పించబోతున్నాడు. ఈ కరువు ఏడు సంవత్సరాలు ఉంటుంది” అన్నాడు.

2కాబట్టి ఆమె దేవుని మనిషి మాటకు లోబడి తన కుటుంబాన్ని తీసుకుని ఫిలిష్తీ దేశం వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించింది.

3ఆ ఏడు సంవత్సరాలు ముగిసిన తరువాత ఆమె ఫిలిష్తీ దేశం నుండి తిరిగి వచ్చి తన ఇంటి కోసం, పొలం కోసం రాజును అడగడానికి వెళ్ళింది.

4ఆ సమయంలో రాజు దేవుని మనిషి దగ్గర పని చేస్తున్న గేహజీతో “ఎలీషా చేసిన గొప్ప విషయాలను నాకు చెప్పు” అన్నాడు.

5చనిపోయిన పిల్లవాణ్ణి ఎలీషా ఎలా బ్రతికించాడో గేహాజీ చెప్తూ ఉండగా ఎలీషా బతికించిన పిల్లవాడి తల్లి తన ఇంటి కోసం, పొలం కోసం రాజును అడగడానికి వచ్చింది. అప్పుడు గేహజీ “నా ప్రభూ, రాజా, ఈమే ఆ స్త్రీ. ఎలీషా బతికించిన పిల్లవాడు వీడే” అన్నాడు.

6రాజు ఆమె కొడుకును గూర్చి ఆమెను అడిగాడు. ఆమె అతనికి అంతా వివరించింది. కాబట్టి రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించాడు. “ఆమెకు చెందిన ఆస్తిని ఆమెకు ఇచ్చేయండి. ఆమె దేశం వదిలి వెళ్ళిన దగ్గరనుండి ఆమె పొలంలో పండిన పంట అంతా ఆమెకివ్వండి” అని ఆదేశించాడు.

7ఎలీషా దమస్కుకి వచ్చాడు. అక్కడ సిరియా రాజు బెన్హదదు జబ్బు పడి ఉన్నాడు. “దేవుని మనిషి ఇక్కడికి వచ్చాడు” అని రాజుకు చెప్పారు.

8రాజు హజాయేలును పిలిచాడు. “నీవు ఒక కానుక తీసుకుని దేవుని మనిషి దగ్గరికి వెళ్ళు. ‘నాకు నయమౌతుందా లేదా’ అని అతని ద్వారా యెహోవా దగ్గర సంప్రదించు” అని చెప్పాడు.

9కాబట్టి హజాయేలు ఎలీషాకు కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని నలభై ఒంటెల మీద ఎక్కించి బయల్దేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. “సిరియా రాజూ, నీ కొడుకులాంటి వాడూ అయిన బెన్హదదు తన రోగం నయమౌతుందా అని అడగడానికి నన్ను పంపాడు” అన్నాడు.

10అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళు. అతనికి తప్పక నయమౌతుంది అని చెప్పు. కానీ అతడు కచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు చూపించాడు” అన్నాడు.

11ఇలా చెప్పి ఎలీషా హజాయేలు సిగ్గు పడేంతగా అతన్నే చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.

12అప్పుడు హజాయేలు “నా ప్రభూ, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. దానికి ఎలీషా “ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నీవు చేయబోయే దుర్మార్గపు పనులు నాకు తెలుసు. వాళ్ళ ప్రాకారాలను నీవు తగలబెడతావు. వాళ్ళల్లో యువకులను కత్తితో హతమారుస్తావు. పిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు. గర్భవతుల కడుపులు చీరేస్తావు” అని జవాబిచ్చాడు.

13అందుకు హజాయేలు “నేను కుక్కలాంటి వాణ్ణి. ఇంత పెద్ద పని నేనెలా చేస్తాను?” అన్నాడు. దానికి ఎలీషా “నీవు సిరియాకు రాజు అవుతావు. నాకు యెహోవా చూపించాడు” అన్నాడు.

14అతడు ఎలీషా దగ్గరనుండి తన రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని అడిగాడు. అతడు “నీకు తప్పకుండా నయమౌతుంది అన్నాడు” అని జవాబిచ్చాడు.

15కాని ఆ తరువాత రోజు హజాయేలు ఒక కంబళి తీసుకుని నీటితో తడిపి దాన్ని రాజు ముఖంపై పరిచాడు. దాంతో రాజు చనిపోయాడు. అతని స్థానంలో హజాయేలు రాజు అయ్యాడు.

16అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన అయిదో సంవత్సరంలో యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదా వాళ్ళపై రాజుగా పరిపాలన ప్రారంభించాడు.

17అతనికప్పుడు ముప్ఫై రెండేళ్ళు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

18ఇతడు అహాబు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి ఇతడు ఇశ్రాయేలు రాజుల్లాగే వ్యవహరించాడు. అహాబు కుటుంబానికి చెందిన వాడిలా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు.

19కానీ యెహోవా తన సేవకుడైన దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు కనుక యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదు వారసులు యూదా రాజ్యాన్ని ఎన్నటికీ పరిపాలిస్తారని దేవుడు దావీదుకి ప్రమాణం చేశాడు.

20ఈ యెహోరాము పాలించిన రోజుల్లో ఎదోమీయులు యూదా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఒక రాజును తమ కోసం నియమించుకున్నారు.

21కాబట్టి యెహోరాము తన సైన్యాన్నీ, రథాలన్నిటినీ తీసుకుని ఎదోము సరిహద్దుల్లో ఉన్న జాయీరు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఎదోము సైన్యాలు వాళ్ళను చుట్టుముట్టాయి. కానీ యెహోరాము రాత్రివేళ తన సైనికులతో రథాలతో శత్రుసైన్యాల పంక్తులను ఛేదించుకుని తప్పించుకున్నారు. అప్పుడు అతని సైన్యం తప్పించుకుని తమ ఇళ్ళకు చేరుకున్నారు.

22కాబట్టి ఈ రోజు వరకూ ఎదోమీయులు యూదా పై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో లిబ్నా ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు.

23యెహోరామును గూర్చిన ఇతర విషయాలకొస్తే, అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

24యెహోరాము చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. దావీదు పట్టణంలో అతని పూర్వీకులతో కూడా అతణ్ణి పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు అహజ్యా రాజు అయ్యాడు.

25అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన పన్నెండో సంవత్సరంలో యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా పరిపాలించడం ప్రారంభించాడు.

26అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతనికి ఇరవై రెండేళ్ళు. ఇతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలన చేశాడు. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజు ఒమ్రీ కూతురు.

27అహజ్యా అహాబు కుటుంబానికి అల్లుడు. కాబట్టి అహాబు కుటుంబానికి చెందిన వాడిలాగే ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు.

28అతడు అహాబు కొడుకు యెహోరాముతో కలసి రామోత్గిలాదు దగ్గర సిరియా రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడ సిరియా సైన్యం యెహోరామును గాయపరిచింది.

29యెహోరాము సిరియా రాజు హజాయేలుతో రమా దగ్గర యుద్ధం చేసినప్పుడు తనకు కలిగిన గాయాలను నయం చేసుకోడానికి యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చాడు. యూదా రాజూ, యెహోరాము కొడుకూ అయిన అహజ్యా, అహాబు కొడుకు యెహోరాము జబ్బు పడ్డాడని తెలుసుకుని అతణ్ణి పరామర్శించడానికి యెజ్రెయేలుకి వచ్చాడు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath