క్రైస్తవం
వెనక్కి

1 సమూయేలు 2

1హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను.

2యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.

3యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.

4పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.

5తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.

6మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.

7యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.

8దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

9తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు. బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.

10యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”

11తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు.

12ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు.

13ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నపుడు యాజకుని మనుషులు మూడుముళ్ళు ఉన్న కొంకిని తీసుకు వచ్చి

14డేక్సాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినపుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకొంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.

15అంతేకాక, వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించేవాడితో “యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చిమాంసమే కావాలి” అనేవాడు.

16“అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు” అని అతనితో చెబితే, వాడు “అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం” అనేవాడు.

17అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది.

18బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.

19అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది.

20“యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు” అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు.

21యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు.

22ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు,

23“ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు?

24నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు.

25మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?” అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు.

26బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు.

27ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను.

28అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.

29నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు.

30నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’

31జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు.

32నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు,

33నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు.

34నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు.

35తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.

36అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, ‘నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో’ అని అతడిని బతిమాలుకుంటారు.”

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath