క్రైస్తవం
వెనక్కి

1 రాజులు 6

1ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్‌ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు.

2సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.

3పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.

4అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు.

5మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు.

6కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు.

7అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు.

8మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి.

9ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు.

10మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.

11అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

12“ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను.

13ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.”

14ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు.

15అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు.

16మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు.

17అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు.

18మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు.

19యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు.

20అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు.

21ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.

22ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు.

23అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు.

24ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు.

25రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి.

26ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు.

27అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి.

28ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు.

29మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు.

30లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు.

31అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి.

32రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు.

33పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు.

34రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.

35వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు.

36లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.

37నాలుగో సంవత్సరం జీప్‌ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు.

38పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath